Induction Stove: గ్యాస్ సిలిండర్ల కొరత భయం.. హాట్ కేకుల్లా ఇండక్షన్ స్టవ్‌లు.. ఆన్‌లైన్‌లో 'అవుట్ ఆఫ్ స్టాక్' బోర్డులు!

Induction Stove Demand Surges Amidst Gas Cylinder Shortage Fears
  • ఎల్‌పీజీ కొరత వస్తుందన్న భయాలతో ఇండక్షన్ స్టవ్‌లకు పెరిగిన డిమాండ్
  • అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో పలు మోడళ్లు 'అవుట్ ఆఫ్ స్టాక్'
  • మూడు రెట్లు గిరాకీ పెరిగిందని తెలిపిన క్రోమా
  • ఎల్‌పీజీ కొరత లేదని, ఆందోళన వద్దని కేంద్ర ప్రభుత్వం భరోసా
  • సరఫరా సజావుగానే ఉందని పెట్రోలియం శాఖ వెల్లడి
దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల లభ్యతపై ఆందోళనలు పెరగడంతో ఇండక్షన్ కుక్‌టాప్‌లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రత్యామ్నాయ వంట మార్గంగా ప్రజలు ఇండక్షన్ స్టవ్‌ల కొనుగోలుకు ఎగబడుతుండటంతో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అవి 'అవుట్ ఆఫ్ స్టాక్'గా మారుతున్నాయి.

ఎన్డీటీవీ కథనం ప్రకారం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బ్లింకిట్ వంటి ఆన్‌లైన్ సైట్లలో ఇండక్షన్ కుక్‌టాప్‌ల లభ్యత గణనీయంగా పడిపోయింది. బ్లింకిట్‌లో దాదాపు అన్ని మోడళ్లు స్టాక్ లేవని చూపిస్తుండగా, అమెజాన్‌లో కెంట్, ఉషా వంటి కొన్ని బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చాలా మోడళ్లు 'అవుట్ ఆఫ్ స్టాక్' బోర్డులతో దర్శనమిస్తున్నాయి.

గత కొన్ని రోజులుగా ఇండక్షన్ కుక్‌టాప్‌ల అమ్మకాలు భారీగా పెరిగినట్లు రిటైలర్లు చెబుతున్నారు. పీటీఐ వార్తా సంస్థ ప్రకారం టాటా గ్రూప్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ రిటైలర్ 'క్రోమా'లో ఇండక్షన్ కుక్‌టాప్‌ల గిరాకీ మూడు రెట్లు పెరిగింది. ఈ విషయాన్ని ఇన్ఫినిటీ రిటైల్ లిమిటెడ్ సీఈవో శిబాషిష్ రాయ్ ధ్రువీకరించారు. అలాగే పిజియన్, గిల్మా వంటి బ్రాండ్లతో కిచెన్ ఉపకరణాలను విక్రయించే స్టవ్‌క్రాఫ్ట్ లిమిటెడ్ ఆన్‌లైన్ అమ్మకాలు నాలుగు రెట్లు పెరిగాయని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర గాంధీ తెలిపారు.

దేశంలోని కొన్ని నగరాల్లో గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం ప్రజలు బారులు తీరుతున్నారనే వార్తల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. వాణిజ్య ఎల్‌పీజీ బుకింగ్‌లను పరిమితం చేసి, గృహ అవసరాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు.

ఎల్‌పీజీ కొరత లేదు: కేంద్ర ప్రభుత్వం
అయితే, దేశంలో గృహావసరాలకు ఉపయోగించే ఎల్‌పీజీ సిలిండర్ల కొరత ఏమాత్రం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించింది. బుక్ చేసిన 2.5 రోజుల్లో సిలిండర్ డెలివరీ అవుతోందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ తెలిపారు. దేశానికి 70 శాతం ముడి చమురు సరఫరా హోర్ముజ్ జలసంధి బయటి మార్గాల నుంచే జరుగుతోందని, సరఫరాకు ఎలాంటి ముప్పు లేదని వివరించారు. ప్రభుత్వ చర్యల వల్ల ఎల్‌పీజీ ఉత్పత్తి 25 శాతం పెరిగిందని కూడా ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం భరోసా ఇస్తున్నప్పటికీ, వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళనతో ఇండక్షన్ స్టవ్‌ల అమ్మకాలు మాత్రం జోరుగా కొనసాగుతున్నాయి.
Induction Stove
LPG shortage
Gas Cylinder
Online sales
Amazon
Flipkart
Croma
Kitchen appliances
Sujata Sharma
Petroleum Ministry

More Telugu News