Dubai Airport: విమాన ప్రయాణం అస్తవ్యస్తం.. చుక్కలు చూపిస్తున్న టికెట్ ధరలు!

Dubai Airport Flight Disruptions Soar Ticket Prices Skyrocket
  • ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో స్తంభించిన విమానయానం
  • భారత్‌కు చెందిన 2,000 సర్వీసులు రద్దు
  • రూ. 20 వేల టికెట్ ధర రూ. 65 వేలకు 
  • ప్రైవేటు జెట్‌లకు విపరీతమైన డిమాండ్
  • లక్షలాది మంది ప్రయాణికులపై యుద్ధ ప్రభావం
గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయ విమానయాన రంగం కుదేలైంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం ముదిరిన నాటి నుంచి మార్చి 8 (ఆదివారం) వరకు కేవలం ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 2,000 సర్వీసులు రద్దు కావడంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. పలు దేశాలు తమ గగనతలాన్ని నిరవధికంగా మూసివేయడంతో స్వదేశానికి రావాలనుకునే వారి సంఖ్య పెరిగిపోయింది.

డిమాండ్‌కు తగ్గట్లు విమానాలు లేకపోవడంతో టికెట్ ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. సాధారణంగా దుబాయ్ నుంచి ముంబైకి రూ. 20 వేలు ఉండే ఎకానమీ క్లాస్ టికెట్ ధర ప్రస్తుతం రూ. 45 వేల నుంచి రూ. 65 వేల వరకు పలుకుతోంది. ప్రైవేటు జెట్ విమానాలకైతే రూ. 50 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి ఎయిర్ ఇండియా వంటి సంస్థలు అదనపు సర్వీసులను నడిపేందుకు ప్రయత్నిస్తున్నా, మార్చి 15 వరకు టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.

ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే దుబాయ్ ఎయిర్‌పోర్టులో సాధారణంగా ప్రతి 72 సెకన్లకోవిమానం రాకపోకలు సాగిస్తుంది. ఏడాదికి 9 కోట్ల మందికి పైగా ఇక్కడి నుంచి ప్రయాణిస్తారు. అయితే యుద్ధం కారణంగా ఫిబ్రవరి 28 నుంచి సర్వీసులు నిలిచిపోయాయి. దోహా, అబుదాబి వంటి కీలక కేంద్రాల్లోనూ 12 వేలకు పైగా సర్వీసులు రద్దు కావడంతో దాదాపు 10 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బహ్రెయిన్, కువైట్ గగనతలం పూర్తిగా మూతపడటంతో ప్రయాణికులను రోడ్డు మార్గంలో పొరుగు దేశాలకు చేరుకోవాలని ఆపరేటర్లు సూచిస్తున్నారు.
Dubai Airport
Flight cancellations
Airline tickets
Gulf war
Air India
International flights
Flight prices
Middle East conflict
Travel disruption
Aviation industry

More Telugu News