Balen Shah: నేపాల్ ఎన్నికల్లో ఆర్ఎస్పీ ప్రభంజనం... పాత పార్టీలను తుడిచిపెట్టిన బాలెన్ షా పార్టీ

Balen Shah Party Sweeps Nepal Elections Uprooting Established Parties
  • నేపాల్ ఎన్నికల్లో యువ పార్టీ ఆర్ఎస్పీ ప్రభంజనం
  • మూడింట రెండొంతుల మెజారిటీ దిశగా ఆ పార్టీ పయనం
  • మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా అనేకమంది హేమాహేమీల ఓటమి
  • పాత పార్టీల వైఫల్యం, ప్రజాగ్రహమే కారణమంటున్న విశ్లేషకులు
  • ప్రధాని అభ్యర్థి బాలెన్ షాకు రికార్డు స్థాయి మెజారిటీ
నేపాల్ రాజకీయాల్లో చారిత్రక శకం ఆవిష్కృతమైంది. కేవలం మూడున్నరేళ్ల క్రితం ఆవిర్భవించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ), పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా పాతుకుపోయిన సంప్రదాయ పార్టీలను తుడిచిపెడుతూ, సోమవారం సాయంత్రానికి వెలువడిన ఫలితాల్లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ (ఎఫ్‌పీటీపీ) విధానంలో 165 స్థానాలకు గాను 163 స్థానాల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, ఆర్ఎస్పీ ఏకంగా 125 సీట్లలో విజయభేరి మోగించింది.

ఈ ఎన్నికల సునామీలో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా ఎందరో రాజకీయ హేమాహేమీలు ఓటమి పాలయ్యారు. ఆర్ఎస్పీ ప్రధాని అభ్యర్థి, ఖాట్మండు మాజీ మేయర్ బాలెన్ షా.. ఓలీకి కంచుకోటగా భావించే ఝాపా-5 నియోజకవర్గంలో ఆయనపై ఘనవిజయం సాధించారు. నేపాల్ పార్లమెంటరీ చరిత్రలోనే ఏ అభ్యర్థికి రానన్ని అత్యధికంగా 68,348 ఓట్లను బాలెన్ షా దక్కించుకోవడం విశేషం. మరోవైపు, నేపాలీ కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా భావించిన గగన్ థాపా కూడా ఆర్ఎస్పీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు.

ఎఫ్‌పీటీపీ విధానంలోనే కాకుండా, దామాషా ప్రాతినిధ్య (ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్) పద్ధతిలోనూ ఆర్ఎస్పీ 48 శాతానికి పైగా ఓట్లతో ఆధిక్యంలో ఉంది. ఈ ట్రెండ్ కొనసాగితే, 275 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో ఆర్ఎస్పీ దాదాపు మూడింట రెండొంతుల మెజారిటీతో (సుమారు 184 సీట్లు) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 1991 తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా ఇంతటి భారీ మెజారిటీని సాధించలేదు.

ప్రజాగ్రహం ఫలితమే ఈ విజయం

సంప్రదాయ పార్టీల పాలనలో పెరిగిన అవినీతి, బంధుప్రీతి, ఆర్థిక వైఫల్యాలపై ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. "ప్రజా సంస్థలలో నిపుణులకు బదులుగా పార్టీలకు దగ్గరైన వారిని నియమించడం వంటి దుష్పరిపాలనపై ప్రజలు విసిగిపోయారు. పాత పార్టీల నాయకత్వం తమ అహంకారాన్ని వీడకపోవడమే ఈ ఫలితాలకు కారణం," అని రాజకీయ విశ్లేషకుడు రాజేంద్ర మహర్జన్ వ్యాఖ్యానించారు.

గత కొన్నేళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడం, యువతకు ఉద్యోగాలు లేకపోవడం, ఉపాధి కోసం పెద్ద సంఖ్యలో విదేశాలకు వలస వెళ్లడం వంటి అంశాలు పాత నాయకత్వంపై వ్యతిరేకతను పెంచాయి. ఈ అంశాలన్నీ కలిసి కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావానికి మార్గం సుగమం చేశాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ చారిత్రక తీర్పుతో నేపాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది.
Balen Shah
Nepal Elections
Rastriya Swatantra Party
RSP Nepal
KP Sharma Oli
Gagan Thapa
Nepalese Congress
Nepal Politics
Balen Shah Party
Nepal Political Crisis

More Telugu News