Zohran Mamdani: న్యూయార్క్ మేయర్ మమ్దానీ ఇంటి వద్ద బాంబుల కలకలం... ఆరుగురి అరెస్ట్

Zohran Mamdani New York Mayor Residence Bomb Scare Six Arrested
  • న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం
  • నిరసనల్లో స్క్రూలు, బోల్టులతో నింపిన పేలుడు పదార్థాల వినియోగం
  • మమ్దానీ ఇంటిపై దాడికి యత్నం.. ఆరుగురు ఆందోళనకారుల అరెస్ట్
  • ఆందోళన సమయానికి ఇంట్లో లేని మేయర్ దంపతులు
  • ఘటనను ఇస్లామోఫోబిక్ చర్యగా ఖండించిన మేయర్ కార్యాలయం
న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ నివాసం వెలుపల శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 'యాంటీ ముస్లిం' నిరసన ప్రదర్శనలో ఆందోళనకారులు స్క్రూలు, బోల్టులతో నింపిన 'స్మోకింగ్ ప్రొజెక్టైల్స్' (పొగ వచ్చే పేలుడు వస్తువులు) విసరడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

రైట్ వింగ్ యాక్టివిస్ట్ జేక్ లాంగ్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. సుమారు 20 మంది మద్దతుదారులు అక్కడ చేరగా.. వారికి వ్యతిరేకంగా 100 మందికి పైగా కౌంటర్ ప్రొటెస్టర్లు నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి ఘర్షణకు దారితీసింది. లాంగ్ మద్దతుదారులు పెప్పర్ స్ప్రే చల్లడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఇరువర్గాలు గుడ్లు విసురుకుంటూ, పిడిగుద్దులతో దాడులు చేసుకున్నాయి.

ఈ గొడవలో ఓ వ్యక్తి పొగలు వెదజల్లే రెండు వస్తువులను జనం మధ్యలోకి విసిరాడు. అవి ఈస్ట్ 87వ వీధిలో పడి మంటలు రావడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఇవి టేపుతో చుట్టిన జాడీలని, అందులో నట్లు, బోల్టులు, స్క్రూలు నింపి ఉన్నాయని, అలాగే ఫ్యూజ్ కూడా అమర్చారని పోలీస్ కమిషనర్ జెస్సికా టిష్ తెలిపారు. బాంబ్ స్క్వాడ్ బృందాలు వీటిని పరిశీలిస్తున్నాయి.

ఘటన జరిగిన సమయంలో మేయర్ మమ్దానీ, ఆయన భార్య ఇంట్లో లేరని పోలీసులు స్పష్టం చేశారు. ఈ దాడిని మేయర్ ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. ఇది ముస్లిం వ్యతిరేక చర్య అని, అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. పేలుడు వస్తువులు విసిరిన 18 ఏళ్ల ఎమిర్ బాలాట్, అతనికి సహకరించిన 19 ఏళ్ల ఇబ్రహీం నిక్, పెప్పర్ స్ప్రే చల్లిన ఇయాన్ మెక్‌గిన్నిస్‌తో పాటు మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతోంది.
Zohran Mamdani
New York Mayor
Bomb scare
Anti-Muslim protest
Jake Lang
East 87th street
Emir Balat
Ibrahim Nik
Ian Mcguinness
New York

More Telugu News