Israel: ఇరాన్‌ పై ఇజ్రాయెల్ ఎన్ని బాంబులు వేసిందంటే..!

Israel Strikes Iran With Thousands of Bombs
  • టెహ్రాన్‌లోని అతిపెద్ద మిలిటరీ కాంపౌండ్‌ పైనే 250 బాంబులు
  • ఇరాన్ ను రెండు భాగాలుగా పంచుకుని అమెరికాతో కలిసి దాడులు
  • మరో రెండు వారాలు యుద్ధం కొనసాగుతుందన్న ఐడీఎఫ్
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. ఇరాన్ పాలనను, ఆ దేశ సైనిక వెన్నెముకను విరిచేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్-అమెరికా దళాలు విరుచుకుపడుతున్నాయి. టెహ్రాన్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఈ సైనిక ఆపరేషన్ మరో రెండు వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) స్పష్టం చేసింది. బుధవారం జరిగిన దాడుల్లో ఇజ్రాయెల్ వాయుసేన తన ప్రతాపాన్ని చూపింది.

సైనిక స్థావరంపై 250 బాంబులు..
టెహ్రాన్‌ లోని అతిపెద్ద సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని 100కు పైగా యుద్ధ విమానాలు ఏకకాలంలో దాడికి దిగాయి. అత్యంత కీలకమైన ఐఆర్‌ జీసీ ప్రధాన కార్యాలయంపైనే సుమారు 250 బాంబులు కురిపించింది. ఈ దాడుల్లో ఖుద్స్‌ ఫోర్స్ ఇంటెలిజెన్స్, సైబర్ యూనిట్, బసిజ్ పారామిలిటరీ ఫోర్స్ హెడ్‌క్వార్టర్స్ పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. టెహ్రాన్ ఎయిర్‌పోర్టులోని డిటెక్షన్ సిస్టమ్స్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఇజ్రాయెల్ దళాలు నేలమట్టం చేశాయి.

5వేల బాంబులు.. వేలల్లో మరణాలు
యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇరాన్‌పై దాదాపు 5 వేల బాంబులు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ అధికారికంగా వెల్లడించింది. ఈ భారీ దాడుల్లో వేలాది మంది ఇరాన్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరాన్‌ ను ఉక్కిరిబిక్కిరి చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. పశ్చిమ, మధ్య ఇరాన్‌ లోని బాలిస్టిక్ క్షిపణి లాంఛర్లు, సైనిక స్థావరాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకోగా.. దక్షిణ ఇరాన్‌ లోని క్షిపణి కేంద్రాలను టార్గెట్ చేసి అమెరికా దాడులు చేస్తోంది. ఇక్కడి నుంచే గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసే ప్రమాదం ఉండటంతో అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ భారీ ఆపరేషన్ కోసం వెయ్యి మందికి పైగా అమెరికన్ నిపుణులు ఇజ్రాయెల్‌ లో ఉంటూ వ్యూహరచన చేస్తున్నారు.

అణు క్షిపణి పరీక్షతో అమెరికా హెచ్చరిక
ఒకవైపు దాడులు జరుగుతుండగానే, అమెరికా అత్యంత శక్తిమంతమైన అణు క్షిపణిని పరీక్షించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది ఇరాన్ మరియు దాని మద్దతు దేశాలకు ఒక గట్టి హెచ్చరిక అని విశ్లేషకులు భావిస్తున్నారు. వరుస దాడులతో ఇరాన్ రక్షణ వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుండగా, మరో రెండు వారాల పాటు ఈ ఆపరేషన్ కొనసాగితే ఇరాన్ కోలుకోవడం కష్టమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Israel
Iran Israel conflict
Israel military
Iran military
Middle East war
IDF
Tehran
US military
Iran nuclear program
Military operation

More Telugu News