Chandrababu Naidu: ఈ కష్ట సమయంలో వారితో ఉండటం నా కర్తవ్యంగా భావించాను: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Visits Fire Accident Victims in Kakinada
  • కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా ప్రమాద బాధితులకు సీఎం భరోసా
  • విజయనగరం పర్యటనలో ఉండగానే కాకినాడకు వెళ్లిన చంద్రబాబు
  • ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు పరామర్శ
  • మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో సంభవించిన బాణసంచా పేలుడు ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను, గాయపడిన వారిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పరామర్శించారు. శనివారం ఆయన బాధితులను ఓదార్చి, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

వాస్తవానికి సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్నారు. అయితే పేలుడు ఘటన తీవ్రత గురించి సమాచారం అందగానే, తన షెడ్యూల్ మార్చుకుని వెంటనే కాకినాడకు బయలుదేరారు. వేట్లపాలెం వద్ద సంఘటన స్థలాన్ని పరిశీలించి, అనంతరం సామర్లకోట ఆసుపత్రిలో, కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

అనంతరం ఈ పర్యటనపై స్పందిస్తూ చంద్రబాబు ఉద్వేగభరితమైన ట్వీట్ చేశారు. "బాధితులకు ధైర్యం చెప్పాను. జరిగిన విషాదం మరచిపోలేనిది.. కలిగిన నష్టం భర్తీ చేయలేనిది" అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి కష్ట సమయంలో బాధితులతో ఉండటం తన కర్తవ్యంగా భావించానని పేర్కొన్నారు. శోకసంద్రంలో ఉన్న మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పానని, ప్రభుత్వ పరంగా అందించాల్సిన సాయం కచ్చితంగా అందిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Chandrababu Naidu
Kakinada fire accident
Vetlapalem explosion
Andhra Pradesh CM
fire accident victims
Samarlakota hospital
Kakinada GGH
AP government support
fire accident compensation

More Telugu News