Achchennaidu: రాష్ట్రంలోని రైతు సోదరులకు శుభవార్త!: మంత్రి అచ్చెన్నాయుడు

Atchannaidu Announces Good News for Farmers in the State
  • నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా శనగల కొనుగోళ్ల ప్రారంభం
  • 94,500 మెట్రిక్ టన్నుల శనగల సేకరణకు నిర్ణయం
  • రైతు సేవా కేంద్రాల ద్వారా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ
  • కొనుగోలు చేసిన 15 రోజుల్లోనే రైతు ఖాతాల్లోకి నగదు జమ
ఆంధ్రప్రదేశ్‌లోని శనగ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా 2025-26 రబీ సీజన్‌కు సంబంధించి శనగల కొనుగోలు ప్రక్రియను నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ధరల మద్దతు పథకం కింద మొత్తం 94,500 మెట్రిక్ టన్నుల శనగలను సేకరించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు అందాయని, నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్ సంస్థల ద్వారా ఈ కొనుగోళ్లు జరుగుతాయని వివరించారు.

కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు అన్ని జిల్లాల్లో సీఎం యాప్ ద్వారా పర్యవేక్షణ ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలు ఈ సేకరణను పర్యవేక్షిస్తాయని తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్, ఏపీ మార్క్‌ఫెడ్ వంటి అన్ని శాఖల సమన్వయంతో నేరుగా రైతు సేవా కేంద్రాల్లోనే కొనుగోళ్లను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రక్రియలో పూర్తి పారదర్శకత కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాలను కూడా భాగస్వామ్యం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.25 లక్షల హెక్టార్లలో శనగ పంట సాగు చేయగా, దాదాపు 3.77 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రైతులు తమ పంటను విక్రయించేందుకు సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. పంట కొనుగోలు చేసిన 15 రోజుల లోపే డబ్బులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమానికి తమ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు.
Achchennaidu
Andhra Pradesh
chana procurement
MSP
Nafed
NCCF
agriculture
farmers welfare
Rythu Seva Kendram
subsidy

More Telugu News