Priyanka: రూ.30 లక్షల నగలు ధరించి పెళ్లికి వెళ్లింది... మళ్లీ తిరిగి రాలేదు!

Priyanka Missing After Attending Wedding in Karnataka
షార్ట్స్‌లో చూడండి
కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఓ మహిళ అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పెళ్లికి హాజరై తిరిగి వస్తున్న ఆమె ఆచూకీ గల్లంతవడం, ఆ తర్వాత ఆమెకు చెందిన దుస్తులు, వస్తువులు అనుమానాస్పద స్థితిలో లభ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తుమకూరు జిల్లా కుణిగల్ ప్రాంతానికి చెందిన ప్రియాంక (29) చిక్కమగళూరులో జరిగిన ఓ వివాహ వేడుకకు ఒంటరిగా వెళ్లింది.

ఫిబ్రవరి 12న రాత్రి 8 గంటల సమయంలో హాసన్ జిల్లా బేలూరు బస్టాండ్ సమీపంలో ఆమె చివరిసారిగా కనిపించింది. అదే రోజు సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, "నాతో పాటు మరొకరు ఉన్నారు" అని చెప్పి వెంటనే కాల్ కట్ చేసింది. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా మొదట సరిగా స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ః

బేలూరు తాలూకా కల్కెరే ప్రాంతంలో ప్రియాంకకు చెందిన కుర్తా, లోదుస్తులు, చెప్పులు, వ్యానిటీ బ్యాగ్ వంటివి వేర్వేరు చోట్ల లభ్యం కావడంతో కేసు తీవ్రరూపం దాల్చింది. ఆమె అదృశ్యమైన సమయంలో సుమారు రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ధరించి ఉందని, వాటి కోసమే ఆమెను ఎవరైనా అపహరించి దాడికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆ తర్వాత కేసును అరెహళ్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు హాసన్ ఎస్పీ శుభాన్విత తెలిపారు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలించాయి. ప్రియాంక ఆచూకీ కోసం భారీ ఎత్తున గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Go Back to Shorts
Priyanka
Hassan district
Karnataka
missing woman
jewellery
kidnap
Belur
Chikkamagaluru
police investigation

More Telugu News