Jacob Bethel: టీ20 ప్రపంచకప్‌: అరంగేట్రంలోనే బెథెల్ అర్ధ శతకం.. పీటర్సన్ రికార్డు సమం!

Jacob Bethel half century equals Pietersen record in T20 World Cup debut
షార్ట్స్‌లో చూడండి
టీ20 ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ శుభారంభం చేసింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం నేపాల్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో అతికష్టం మీద విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ యువ ఆటగాడు జాకబ్ బెథెల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన అరంగేట్ర ప్రపంచకప్ మ్యాచ్‌లోనే అర్ధ శతకం బాది, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో మాజీ దిగ్గజం కెవిన్ పీటర్సన్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. 2007లో పీటర్సన్ తర్వాత, టీ20 ప్రపంచకప్ అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ చేసిన రెండో ఇంగ్లండ్ ఆటగాడిగా బెథెల్ చరిత్ర సృష్టించాడు.

మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ త్వరగా ఔట్ కాగా, జోస్ బట్లర్ (22) వేగంగా ఆడినా ఎక్కువసేపు నిలవలేదు. అయితే ఈ క్రమంలో బట్లర్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టామ్ బాంటన్ (2) కూడా విఫలమవడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది.

ఈ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన బెథెల్, కెప్టెన్ హ్యారీ బ్రూక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. నేపాల్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి కేవలం 35 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. బ్రూక్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 71 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. బెథెల్ అద్భుత ఇన్నింగ్స్ వల్లే ఇంగ్లండ్ పోరాడగలిగే స్కోరు చేయగలిగింది. బెథెల్ అద్భుతంగా ఆడాడని, ముఖ్యంగా స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకున్న విధానం బాగుందని కెప్టెన్ హ్యారీ బ్రూక్ ప్రశంసించాడు. ఇంగ్లండ్ తమ తదుపరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 11న ఇదే వేదికపై వెస్టిండీస్‌తో ఆడనుంది.
Go Back to Shorts
Jacob Bethel
T20 World Cup
England
Nepal
Kevin Pietersen
Harry Brook
Phil Salt
Jos Buttler
T20 debut
cricket

More Telugu News