Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం

Asha Cheetah Gives Birth to Five Cubs at Kuno National Park
  • రెండోసారి పిల్లలకు జన్మనిచ్చిన‌ నమీబియా చీతా ‘ఆశా’ 
  • దేశంలో 35కి చేరిన మొత్తం చీతాల సంఖ్య
  • ప్రాజెక్ట్ చీతా విజయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హర్షం
  • ఈ నెల 28న బోట్స్వానా నుంచి మరో 8 చీతాల రాక
మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్కులో (KNP) ‘ప్రాజెక్ట్ చీతా’ మరో కీలక మైలురాయిని అందుకుంది. నమీబియా నుంచి తీసుకొచ్చిన ‘ఆశా’ అనే ఆడ చీతా ఐదు కూనలకు జన్మనిచ్చింది. రెండేళ్లలో ఆశా పిల్లలకు జన్మనివ్వడం ఇది రెండోసారి కావడం విశేషం. ఈ పరిణామం భారత్‌లో చీతాల పునఃప్రవేశ కార్యక్రమం విజయవంతం అవుతోందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.

ఈ శుభవార్తను మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా పంచుకున్నారు. ఇది రాష్ట్రానికే కాకుండా దేశానికే గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. "ఈ కొత్త జననాలతో భారత్‌లో పుట్టిన చీతా కూనల సంఖ్య 24కు, మొత్తం చీతాల సంఖ్య 35కి చేరింది. అటవీ సిబ్బంది, పశువైద్యుల అవిశ్రాంత కృషి వల్లే ఇది సాధ్యమైంది" అని ఆయన తెలిపారు.

కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కూడా ఈ విషయంపై హర్షం వ్యక్తం చేశారు. "ఆశా వారసత్వం ముందుకు సాగుతోంది. తన ఐదు కూనలకు భారత్ స్వాగతం పలుకుతోంది" అని ఆయన పోస్ట్ చేశారు. భారత గడ్డపై ఇది ఎనిమిదో విడత చీతాల జననం అని, వన్యప్రాణి సంరక్షణలో ఇది చరిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు.

2022 సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను కూనో పార్కులో విడుదల చేశారు. ఆ మొదటి బృందంలో ఆశా కూడా ఉంది. ఇదివరకే 2024 జనవరి 3న ఆశా మూడు కూనలకు జన్మనిచ్చింది. ఇక‌, ఈ నెల‌ 28న బోట్స్వానా నుంచి మరో 8 చీతాలు మధ్యప్రదేశ్‌కు రానున్నాయి.
Asha Cheetah
Kuno National Park
Project Cheetah
Madhya Pradesh
Cheetah Cubs
Wildlife Conservation
Bhupender Yadav
Mohan Yadav
Namibia
Cheetah Reintroduction India

More Telugu News