Vangalapudi Anitha: ఇంత స్పష్టమైన ఆధారాలున్నా వైసీపీ నేతలు ఎదురుదాడి చేయడం సిగ్గుచేటు: అనిత

Vangalapudi Anitha Slams YCP Leaders Over Tirumala Laddu Adulteration
షార్ట్స్‌లో చూడండి
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో భారీ కుంభకోణం జరిగిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఐదేళ్ల పాలన 'కల్తీకి కేరాఫ్ అడ్రస్‌'గా నిలిచిందని, పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలోకి కూడా కల్తీని తీసుకొచ్చి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు.

నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పడానికి తమ వద్ద నాలుగు కీలక నివేదికలు ఉన్నాయని అనిత స్పష్టం చేశారు. 2022లోనే మైసూర్‌లోని CFTRI నివేదిక నెయ్యిలో పామాయిల్ ఉన్నట్లు తేల్చిందని, కేంద్ర ప్రభుత్వ ల్యాబ్ NDDB అందులో జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారించిందని తెలిపారు. ఇక NDRI రిపోర్ట్ ప్రకారం అది నెయ్యే కాదని, రసాయనాల ముద్ద అని తేలిందని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని సిట్ (SIT) కూడా కల్తీని ధృవీకరించిందని అన్నారు. ఇంత స్పష్టమైన ఆధారాలున్నా వైసీపీ నేతలు ఎదురుదాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.

కేవలం కొంతమందికి లబ్ధి చేకూర్చేందుకే టెండర్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా నీరుగార్చారని, రూ.254 కోట్ల ఈ స్కామ్‌లో అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిదే ప్రధాన బాధ్యత అని అనిత ఆరోపించారు. ఆయన సంతకం లేకుండా ఇది ఎలా జరిగిందని ప్రశ్నించారు. "కల్తీ జరగలేదని చెప్పడానికి వైసీపీ దగ్గర ఒక్కటంటే ఒక్క అధికారిక నివేదిక ఉందా? 'సాక్షి' పత్రికలో వచ్చే రాతలే మీకు రిపోర్టులా?" అని ఆమె ఎద్దేవా చేశారు.

అయోధ్య రామాలయానికి కూడా ఈ కల్తీ లడ్డూలనే పంపి మహాపచారానికి ఒడిగట్టారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అనుమతి లేకుండా 'పరామర్శ యాత్రల' పేరుతో ప్రజలను ఇబ్బంది పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని హోంమంత్రిగా హెచ్చరించారు. దైవద్రోహానికి పాల్పడినందుకే ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసి బుద్ధి చెప్పారని అన్నారు.
Go Back to Shorts
Vangalapudi Anitha
Tirumala laddu
TTD scam
YV Subba Reddy
ghee adulteration
Andhra Pradesh politics
TDP
YSRCP
Tirupati
ayyodhya ram mandir

More Telugu News