Chandrababu Naidu: రాష్ట్రంలో హింసను ప్రేరేపించాలని చూస్తోంది.. వైసీపీపై చంద్రబాబు ఫైర్

Chandrababu Naidu Accuses YSRCP of Provoking Violence in Andhra Pradesh
  • అధికారం కోల్పోయామనే అసహనంతో రెచ్చగొట్టేందుకు యత్నం
  • ఆ పార్టీ ట్రాప్ లో పడొద్దంటూ పార్టీ నేతలకు సూచన
  • మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ లో అలజడి సృష్టించాలని, హింసను ప్రేరేపించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఇందులో భాగంగానే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని... ఆ ట్రాప్ లో పడొద్దని టీడీపీ నేతలకు ఆయన సూచించారు. ఈ మేరకు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో ఆయన ఈ రోజు ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

అధికారం కోల్పోయామనే అసహనంతోనే వైసీపీ రెచ్చగొట్టాలని చూస్తోందని చంద్రబాబు చెప్పారు. అందుకే ఆ పార్టీ నేతలు బూతులు మాట్లాడుతున్నారని, సంయమనం పాటించాలని చెప్పారు. ఈ టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ రెచ్చగొట్టే చర్యలకు దిగుతోందన్న చంద్రబాబు.. ఆ పార్టీ ఉచ్చులో పడి టీడీపీ శ్రేణులు సంయమనం కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత సీనియర్ నేతలదేనని చెప్పారు. హింస, విధ్వంసం, అవినీతి పునాదులపై వైసీపీ పుట్టిందని, ఆ పార్టీ ట్రాప్‌లో పడితే వారికీ మనకూ తేడా ఉండదని అన్నారు. ఈ సందర్భంగా తప్పుచేసిన ప్రతి ఒక్కరినీ చట్టపరంగా శిక్షించి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన వైసీపీని రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు. ఈ క్రమంలో తాము చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టి మళ్లించాలని ఆ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న టీడీపీ అజెండా సహజంగానే వైసీపీ నేతలకు నచ్చదని చంద్రబాబు గుర్తుచేశారు. అందుకే అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు.
Chandrababu Naidu
YSRCP
Andhra Pradesh Politics
TDP
Political Violence
Palla Srinivasa Rao
Payyavula Keshav
Tirumala Laddu
AP Government

More Telugu News