నా దుస్థితికి ఆర్మీ చీఫే కారణం: సోదరితో ఇమ్రాన్‌ఖాన్
- ఇమ్రాన్‌ఖాన్ మృతి వదంతులకు చెక్
- 25 రోజుల తర్వాత సోదరితో భేటీ
- జైలులో తనను మానసికంగా హింసిస్తున్నారన్న మాజీ ప్రధాని
దాదాపు 25 రోజుల తర్వాత కుటుంబ సభ్యులతో ఇమ్రాన్‌కు ఇదే తొలి భేటీ. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఉజ్మా, తన సోదరుడు ప్రాణాలతోనే ఉన్నారని, అయితే తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నారని తెలిపారు. "'అల్లా దయవల్ల ఆయన ప్రాణాలతో, మంచి ఆరోగ్యంతోనే ఉన్నారు. కానీ తనను మానసికంగా హింసిస్తున్నారని, ఏకాంత నిర్బంధంలో ఉంచారని తీవ్ర ఆవేదనతో చెప్పారు. రోజులో కొద్దిసేపు తప్ప మిగతా సమయమంతా సెల్‌లోనే బంధిస్తున్నారు' అని ఉజ్మా వెల్లడించారు.
గత కొన్ని వారాలుగా ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారంటూ సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్ నుంచి తీవ్రమైన ప్రచారం జరిగింది. కుటుంబ సభ్యులను, న్యాయవాదులను కలిసేందుకు జైలు అధికారులు అనుమతించకపోవడంతో ఈ వదంతులకు మరింత బలం చేకూరింది. దీంతో పీటీఐ కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు ఇస్లామాబాద్, రావల్పిండిలలో నిరసనలకు దిగారు.
ఇమ్రాన్ ఖాన్ అసాధారణ ప్రజాదరణకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం భయపడుతోందని పీటీఐ ఆరోపిస్తోంది. ఆయనను మానసికంగా దెబ్బతీసి, దేశం విడిచి వెళ్లేలా ఒత్తిడి చేసేందుకే ఈ కుట్ర జరుగుతోందని పార్టీ సెనేటర్ ఖుర్రం జీషన్ విమర్శించారు. ప్రపంచకప్ విజేత కెప్టెన్, 72 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్.. తోషాఖానా సహా పలు కేసుల్లో దోషిగా తేలడంతో 2023 ఆగస్టు నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.