YS Sharmila: సినిమా టికెట్ ధరలు పెంచడంపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదు: షర్మిల

YS Sharmila Criticizes Government Neglect of Onion Farmers
  • ఉల్లి ధరల సంక్షోభంపై కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ధ్వజం
  • రైతులకు కిలోకి 50 పైసలు కూడా దక్కడం లేదని తీవ్ర ఆవేదన
  • క్వింటాకు రూ.1200 గిట్టుబాటు ధర ఇస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శ
  • మార్క్‌ఫెడ్ ఒక్క కిలో ఉల్లి కూడా సేకరించలేదని ఆరోపణ
  • ఉల్లి రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని డిమాండ్
  • కర్నూల్ మార్కెట్‌లో దళారుల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వానికి పిలుపు
రాష్ట్రంలో ఉల్లి రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని, వారిని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస ధర లేక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే, ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆమె మండిపడ్డారు. ఉల్లి రైతుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగలకుండా పోదని హెచ్చరించారు.

ఈ మేరకు శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. "ఎకరాకు లక్షా 20 వేల రూపాయల పెట్టుబడి పెట్టి ఉల్లి పండిస్తే, కిలోకి 50 పైసలు, క్వింటాకు 50 రూపాయలు కూడా దక్కని దారుణ పరిస్థితి నెలకొంది. దీనివల్ల రైతుకు ఎకరానికి కేవలం 3 వేల రూపాయలు మిగిలి, లక్షా 15 వేల నష్టం వస్తోంది. ఇంతటి నష్టాలతో రైతు ఎలా బతకాలి?" అని షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కర్నూల్ మార్కెట్‌లో దళారులతో సంబంధం లేకుండా క్వింటాకు రూ.1,200 చెల్లిస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం, ఆ హామీని గాలికొదిలేసిందని ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థ అయిన మార్క్‌ఫెడ్ ఒక్క కిలో ఉల్లిని కూడా కొనుగోలు చేయలేదని ఆమె దుయ్యబట్టారు.

"ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ ఆ ఉల్లి పండించిన రైతే ఉరి వేసుకునే దుస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. గిట్టుబాటు ధర లేక, కనీసం రవాణా ఖర్చులు కూడా రాక రైతులు మార్కెట్‌లోనే ఉల్లిని వదిలేసి వెళుతున్నారు. వారి కళ్లలో ఆనందం నింపుతామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇప్పుడు వారిని కన్నీళ్లపాలు చేస్తున్నారు" అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సినిమా బెనిఫిట్ షోల టికెట్ ధరలు పెంచడంపై ఉన్న శ్రద్ధ, అన్నదాతకు గిట్టుబాటు ధర కల్పించడంపై లేకపోవడం బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఉల్లి రైతుల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆమె స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వ విజయాల గురించి డబ్బా కొట్టుకోవడం మాని, ఉల్లి రైతుల కష్టాలపై చర్చ చేపట్టాలని సూచించారు. మార్క్‌ఫెడ్ ద్వారా ఇస్తామని ప్రకటించిన రూ.1200 గిట్టుబాటు ధరను తక్షణమే రైతులకు చెల్లించాలని, కర్నూల్ మార్కెట్‌లో దళారుల దోపిడీని అరికట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
YS Sharmila
Sharmila Reddy
AP Congress
Onion farmers
Andhra Pradesh farmers
Farmer crisis
Chandrababu Naidu
AP Government
Markfed
Kurnool market

More Telugu News