Sadhguru: సద్గురు డీప్‌ఫేక్ వీడియోతో వల.. రూ.3.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ

Sadhguru Deepfake Video Swindles Woman of 375 Crores
  • బెంగళూరులో వెలుగులోకి ఘరానా మోసం
  • ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడి పేరుతో మహిళకు వల
  • యూట్యూబ్ వీడియో చూసి లింక్ క్లిక్ చేయడంతో ఘటన
  • 'మిరాక్స్' యాప్ డౌన్‌లోడ్ చేయించి డబ్బులు కాజేసిన కేటుగాళ్లు
  • భారీ సైబర్ క్రైమ్ రాకెట్ అని పోలీసుల అనుమానం
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు పేరుతో రూపొందించిన ఒక ఏఐ  డీప్‌ఫేక్ వీడియోను నమ్మి, బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఏకంగా రూ. 3.75 కోట్లు మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని ఆశచూపిన సైబర్ నేరగాళ్లు, ఆమెను నిలువునా దోచేశారు.

సీవీ రామన్ నగర్ నివాసి అయిన వర్షా గుప్తా ఈ ఏడాది ఫిబ్రవరి 25న యూట్యూబ్ చూస్తుండగా సద్గురుకు సంబంధించిన ఒక వీడియోను చూశారు. అందులో కేవలం 250 డాలర్ల పెట్టుబడితో ఒక ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో చేరితే అత్యధిక లాభాలు పొందవచ్చని సద్గురు చెబుతున్నట్లు ఉంది. డీప్‌ఫేక్ టెక్నాలజీ గురించి అవగాహన లేని ఆమె అది నిజమైన వీడియో అని నమ్మారు. వీడియో కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేయడంతో మోసం మొదలైంది.

ఆ వెంటనే, వలీద్ బి అనే వ్యక్తి ఆమెను సంప్రదించాడు. 'మిరాక్స్ యాప్' ప్రతినిధిగా పరిచయం చేసుకుని విదేశీ ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్స్ ఉపయోగించి ఆమెతో మాట్లాడాడు. అతడి సూచన మేరకు బాధితురాలు 'మిరాక్స్' అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంది. జూమ్ ద్వారా ట్రేడింగ్ పాఠాలు చెబుతూ నమ్మకం కలిగించాడు. వలీద్ అందుబాటులో లేనప్పుడు మైఖేల్ సి అనే మరో వ్యక్తి ఆమెకు సూచనలు ఇచ్చేవాడు.

వారి మాటలు పూర్తిగా నమ్మిన వర్షా గుప్తా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో పలు దఫాలుగా తన బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డుల నుంచి మొత్తం రూ.3.75 కోట్లను వారు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశారు. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దీని వెనుక పెద్ద సైబర్ క్రైమ్ ముఠా హస్తం ఉండొచ్చని అనుమానిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.
Sadhguru
Sadhguru deepfake
deepfake video
cyber crime
online fraud
Mirax app
trading app
Bengaluru
investment fraud
Varsha Gupta

More Telugu News