ఇలాంటి కార్యక్రమాలకు నన్ను కాకుండా శివకుమార్, కమల్ హాసన్ లాంటి వారిని పిలవాలి: రజనీకాంత్
- 'వేల్పారి' పుస్తక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రజనీకాంత్
- రామకృష్ణ ఆశ్రమం ద్వారా తనకు పుస్తకపఠనం అలవాటుగా మారిందని వెల్లడి
- ఓ పుస్తకం చదివి కన్నీళ్లు పెట్టుకున్నానన్న రజని
ఇలాంటి కార్యక్రమాలను శివకుమార్, కమల్ హాసన్ లాంటి వారిని పిలవాలని... ఎందుకంటే వారు మేధావులు అని రజనీ చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని తనను ఆహ్వానించినప్పుడు... 75 ఏళ్ల వయసులో కూలింగ్ గ్లాస్ పెట్టుకుని స్లో మోషన్ లో నడిచే తనను ఎందుకు పిలిచారా అని ఆశ్చర్యపోయానని నవ్వులు పూయించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో తాను చేసిన వ్యాఖ్యలు ఒకింత వివాదాస్పదమయ్యాయని... అందుకే ఈసారి ఆచితూచి మాట్లాడాలనుకుంటున్నానని సరదాగా వ్యాఖ్యానించారు.
రామకృష్ణ ఆశ్రమం వల్ల తనకు పుస్తకపఠనం అలవాటుగా మారిందని రజనీ తెలిపారు. తాను ఎన్నో గొప్ప పుస్తకాలు చదివానని చెప్పారు. జయకంధన్ రచించిన ఓ పుస్తకం చదివి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని తెలిపారు. 'వేల్పారి' పుస్తకాన్ని చదవడాన్ని ప్రారంభించానని... 25 శాతం చదవడం పూర్తయిందని... సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఆ పుస్తకం చదవడాన్ని పూర్తి చేస్తానని చెప్పారు. 'వేల్పారి' ఆధారంగా దర్శకుడు శంకర్ తెరకెక్కించనున్న సినిమా కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు. మరోవైపు రజనీ నటించిన 'కూలీ' చిత్రం ఆగస్ట్ 14న విడుదల కానుంది.