ప్రేగుల్లోని బ్యాక్టీరియాతో వ్యాధులకు చెక్.. జపాన్ శాస్త్రవేత్తల కొత్త ఏఐ మోడల్
- ప్రేగుల్లోని బ్యాక్టీరియాను విశ్లేషించేందుకు జపాన్ శాస్త్రవేత్తల కొత్త ఏఐ మోడల్
- 'విబేయస్‌ఎంఎం' పేరుతో ప్రత్యేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపకల్పన
- క్యాన్సర్, ఊబకాయం, నిద్రలేమి వంటి వ్యాధులపై పరిశోధన
- వ్యాధులకు, బ్యాక్టీరియాకు మధ్య సంబంధాన్ని కచ్చితంగా గుర్తిస్తున్న ఏఐ
- టోక్యో విశ్వవిద్యాలయం పరిశోధకుల కీలక ముందడుగు
మానవ శరీరంలో కణాల కన్నా ఎక్కువగా, దాదాపు 100 ట్రిలియన్ల బ్యాక్టీరియా మన ప్రేగుల్లో నివసిస్తుంది. ఏ బ్యాక్టీరియా ఏ రసాయనాలను ఉత్పత్తి చేస్తుందో, వ్యాధుల సమయంలో ఈ సంబంధాలు ఎలా మారుతాయో అర్థం చేసుకోవడం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు సవాలుగా ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు, టోక్యో యూనివర్సిటీ పరిశోధకులు 'విబేయస్‌ఎంఎం' (VBayesMM) అనే ప్రత్యేక బయేసియన్ న్యూరల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించారు. ఇది భారీ డేటాను విశ్లేషించి, వ్యాధులకు కారణమయ్యే కీలక బ్యాక్టీరియాలను కచ్చితంగా గుర్తిస్తుంది.
ఈ పరిశోధనలో పాలుపంచుకున్న తుంగ్ డాంగ్ మాట్లాడుతూ... "నిద్రలేమి, ఊబకాయం, క్యాన్సర్ వంటి వ్యాధులపై జరిపిన అధ్యయనాల్లో మా ఏఐ వ్యవస్థ, ప్రస్తుతం ఉన్న పద్ధతుల కన్నా మెరుగైన ఫలితాలు ఇచ్చింది. ఇది కేవలం గణాంకాలను కాకుండా, నిజమైన జీవ సంబంధాలను కనుగొన్నట్లు రుజువైంది.
ఈ సాంకేతికతతో, భవిష్యత్తులో మనకు మేలు చేసే రసాయనాలను ఉత్పత్తి చేయడానికి నిర్దిష్ట బ్యాక్టీరియాను పెంచడం లేదా వ్యాధులను నయం చేయడానికి ప్రత్యేక చికిత్సలను రూపొందించడం సాధ్యమవుతుంది" అని వివరించారు. ఈ ఏఐ ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఇచ్చే సమాధానాలపై ఉన్న అనిశ్చితిని కూడా తెలియజేస్తుంది. దీనివల్ల పరిశోధకులకు ఫలితాలపై మరింత నమ్మకం కలుగుతుంది.