బ్యాంకులకు చేరిన 'తల్లికి వందనం' పథకం నిధులు
- ఏపీలో నిన్నటి నుంచి 'తల్లికి వందనం' పథకం అమలు
- 35,44,459 తల్లులు, సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో జమకానున్న నిధులు
- ఒక్కో విద్యార్థికి రూ.15వేలు చొప్పున విడుదల చేసిన ప్రభుత్వం
'తల్లికి వందనం' పథకం అంటే ఏమిటి?
పేద పిల్లలు చదువును మధ్యలోనే ఆపకుండా కొనసాగించేందుకు తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా రూ. 15,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుంది. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు ఈ సాయం అందిస్తారు. ఇందులో విద్యార్థికి రూ.13,000 ఇవ్వగా.. పాఠశాల/ కాలేజీ నిర్వహణ (అభివృద్ధి)కి రూ.2000 కేటాయిస్తారు. విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని తల్లి బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేస్తారు. తల్లి లేకపోతే తండ్రి లేదా సంరక్షకుడి ఖాతాలో ఈ మొత్తం జమ చేస్తారు.
'తల్లికి వందనం' పథకం అర్హతలు
- దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి
- విద్యార్థి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదువుతుండాలి
- విద్యార్థికి కనీసం 75శాతం హాజరు తప్పనిసరి
- విద్యార్థి తల్లి పేరు మీద బ్యాంక్ ఖాతా ఉండాలి
- ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలే ఈ పథకానికి అర్హులు (పేదరిక రేఖకు దిగువన ఉండాలి)
- ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ తదితర ప్రజా ప్రతినిధుల పిల్లలు ఈ పథకానికి అర్హులు కారు