నాడు బైడెన్ ను హేళన చేసిన ట్రంప్ కు నేడు అదే పరిస్థితి.. వీడియో ఇదిగో!
- ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కుతూ తడబడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
- క్యాంప్ డేవిడ్‌కు వెళ్లే క్రమంలో ఘటన
- బైడెన్‌ను ట్రోల్ చేసిన సంగతి గుర్తుకొస్తోందా అంటూ నెటిజన్ల కామెంట్లు
గతంలో జో బైడెన్ ఇలాగే విమానం ఎక్కుతూ పలుమార్లు తడబడినప్పుడు ట్రంప్ ఆయనను ఎగతాళి చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ట్రంప్ కూడా అదే రీతిలో తడబడటంతో నెటిజన్లు ఆ పాత విషయాలను గుర్తు చేస్తున్నారు. క్యాంప్ డేవిడ్ పర్యటనకు ముందు, 78 ఏళ్ల ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఇటీవలి వలస దాడుల నేపథ్యంలో లాస్ ఏంజెలెస్‌లో జరుగుతున్న నిరసనలను అదుపు చేయడానికి ఇన్సరెక్షన్ యాక్ట్‌ను ప్రయోగించే ఆలోచన ఉందా అని విలేకరులు ప్రశ్నించారు. అయితే, దీనిపై ఆయన స్పందించలేదు.
విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో కలిసి ట్రంప్ మీడియాతో మాట్లాడారు. క్యాంప్ డేవిడ్ పర్యటన ఉద్దేశం గురించి అడగ్గా "మేము క్యాంప్ డేవిడ్‌కు వెళ్తున్నాము. చాలా ముఖ్యమైన విషయాలపై వివిధ వ్యక్తులతో సమావేశాలు ఉన్నాయి" అని ట్రంప్ క్లుప్తంగా సమాధానమిచ్చారు. మరిన్ని వివరాలు చెప్పాలని కోరగా, "ఇవన్నీ చాలా ముఖ్యమైనవి, కానీ నేను ఇప్పుడు వివరాల్లోకి వెళ్లలేను" అని ఆయన తెలిపారు. క్యాంప్ డేవిడ్‌లో జరిగే సమావేశాలకు ఎవరైనా "విదేశీ అతిథులు" హాజరవుతున్నారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేనంటూ ట్రంప్ బదులిచ్చారు.