రజనీకాంత్ రిటైర్మెంట్ పై ఆయన భార్య ఆసక్తికర సమాధానం
- సూపర్ స్టార్ రజనీకాంత్ రిటైర్మెంట్ వార్తలపై ఊహాగానాలు
- తనకు సమాధానం తెలిస్తే చెప్పేదాన్నన్న రజనీ భార్య లత
- ప్రస్తుతం 'కూలీ', 'జైలర్ 2' చిత్రాలతో బిజీగా ఉన్న తలైవా
తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆయన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుందని, రజనీకాంత్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్నారని సమాచారం. దీనితో పాటు, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రానున్న 'జైలర్ 2' షూటింగ్‌లో కూడా ఆయన పాల్గొంటున్నారు. ఇలా వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సమయంలోనే ఆయన రిటైర్మెంట్ వార్తలు తెరపైకి వచ్చాయి.
ఇటీవల, రజనీకాంత్ నటనకు స్వస్తి పలకనున్నారంటూ కొన్ని ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈ వార్తలు ఆయన అభిమానులను కొంత ఆందోళనకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో, రజనీకాంత్ అర్ధాంగి లత రజనీకాంత్ తాజాగా ఈ ఊహాగానాలపై స్పందించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లతను మీ భర్త సినిమాల నుంచి విరామం తీసుకునే ఆలోచనలో ఉన్నారా? అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ఇందుకు లత బదులిస్తూ, "ఆ ప్రశ్నకు సమాధానం నాకు తెలిస్తే బాగుండేది. తెలిస్తే కచ్చితంగా మీకు చెప్పేదాన్ని" అని అన్నారు. ఆమె నేరుగా సమాధానం ఇవ్వకపోవడంతో, రజనీకాంత్ భవిష్యత్ ప్రణాళికలపై నెలకొన్న సందిగ్ధత ప్రస్తుతానికి కొనసాగుతూనే ఉంది.