ఇలాగైతే పార్లమెంటును మూసేయవచ్చంటూ బీజేపీ ఎంపీల వ్యాఖ్య.. తమకు సంబంధం లేదన్న ఆ పార్టీ చీఫ్ నడ్డా
- సుప్రీంకోర్టుపై కొనసాగుతున్న బీజేపీ ఎంపీల దాడి
- అత్యున్నత న్యాయస్థానంపై బీజేపీ నేతలు నిషికాంత్ దూబే, దినేశ్ శర్మ విమర్శలు
- అవి వారి వ్యక్తిగత వ్యాఖ్యలని.. వాటితో పార్టీకి సంబంధం లేదన్న నడ్డా
బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే ఇక పార్లమెంటుతో పనేముందని, దానిని మూసుకోవడం మేలని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, దేశంలో పౌరయుద్ధం సంభవిస్తే అందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నానే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఎంపీ దినేశ్ శర్మ మాట్లాడుతూ.. పార్లమెంటును కానీ, రాష్ట్రపతిని కానీ ఎవరూ ఆదేశించలేరని పేర్కొన్నారు. ‘‘భారత రాజ్యాంగం ప్రకారం.. లోక్‌సభను కానీ, రాజ్యసభను కానీ, అధ్యక్షుడిని కానీ ఎవరూ నిర్దేశించలేరు. ఎందుకంటే రాష్ట్రపతే సుప్రీం’’ అని శర్మ పేర్కొన్నారు. కాగా, ఇటీవల ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ కూడా న్యాయవ్యవస్థపై విరుచుకుపడ్డారు.