మస్క్ కు మద్దతుగా టెస్లా కారు కొన్న ట్రంప్
- వైట్ హౌస్ కు చేరిన టెస్లా కారు
- డిస్కౌంట్ అడగలేదన్న ప్రెసిడెంట్
- ఎలాన్ మస్క్ దేశభక్తుడంటూ ప్రశంసలు
డొనాల్డ్ ట్రంప్ సర్కారులో ఎలాన్ మస్క్ సలహాదారుగా వ్యవహరించడంపై అమెరికాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలో మస్క్ జోక్యానికి నిరసనగా ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల మస్క్ కు చెందిన టెస్లా కార్ షోరూం ముందు పలువురు నిరసనకారులు ఆందోళన చేశారు. ఈ నిరసనలు టెస్లా కార్ల అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి. అమ్మకాలు తగ్గడంతో టెస్లా షేర్లు కూడా పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఎలాన్ మస్క్ గొప్ప దేశభక్తుడని కితాబునిచ్చారు. ఆయనకు మద్దతుగా తాను ఓ టెస్లా కారును కొనుగోలు చేస్తానని చెప్పారు. మంగళవారం ట్రంప్ కోసం పలు లేటెస్ట్ మోడల్ టెస్లా కార్లను ఎలాన్ మస్క్ వైట్ హౌస్ కు తెప్పించారు. ఆయా మోడల్ కార్ల ప్రత్యేకతలను ట్రంప్ కు మస్క్ దగ్గరుండి వివరించారు. దీంతో వైట్ హౌస్ కాస్తా కాసేపు టెస్లా షోరూంలాగా మారింది.