ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహావుర్ రానా స్టే పిటిషన్‌ను కొట్టేసిన అమెరికా సుప్రీంకోర్టు
- ముంబై ఉగ్రదాడుల కుట్రలో ప్రధాన నిందితుడిగా తహావుర్ రానా
- అతడిని భారత్‌కు అప్పగిస్తామని గత నెలలో ప్రకటించిన ట్రంప్
- భారత్ తనను చిత్రహింసలు పెడుతుందని, అప్పగింతపై స్టే విధించాలని కోర్టుకు రానా
- స్టే విధించేందుకు అమెరికా సుప్రీంకోర్టు నిరాకరణ
రానా అప్పగింతపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు జస్టిస్ ఎలెనా కగన్ తిరస్కరించారు. 63 ఏళ్ల రానా పాకిస్థాన్ సంతతికి చెందిన కెనడా జాతీయుడు. ప్రస్తుతం లాస్ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నాడు. పాకిస్థాన్‌కు చెందిన ఎల్‌ఈటీ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీతో సంబంధాలు కలిగిన రానా 2008 ముంబై ఉగ్రదాడి కుట్రలో ప్రధాన నిందితుడు. నాటి ఘటనలో 175 మంది మరణించారు.
తాను పాకిస్థాన్ సంతతికి చెందిన ముస్లింను కావడంతో తనను భారత్‌క్ అప్పగిస్తే చిత్రహింసలు పెడతారని, కాబట్టి తనను ఆ దేశానికి అప్పగించవద్దని తహావుర్ రానా ఈ వారం మొదట్లో కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశాడు. గత నెలలో భారత ప్రధాని మోదీతో సమావేశం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ ‘దుష్టుడైన’ రానాను భారత్‌కు అప్పగించేందుకు తన యంత్రాంగం అంగీకరించినట్టు తెలిపారు. ఈ ప్రకటన తర్వాత రానా సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడాయనకు ఎదురుదెబ్బ తగిలింది.