Advertisement

చంద్రబాబు చేతికింది మనుషులను తెలంగాణ సలహాదారుగా నియమించారు: హరీశ్ రావు

Harish Rao takes on Congress government
  • ఏపీకి పని చేసిన వ్యక్తిని తెలంగాణకు నియమిస్తే న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్న
  • కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వరప్రదాయిని అన్న హరీశ్ రావు
  • కాళేశ్వరం ప్రాజెక్టు కుంగితే రంగనాయకసాగర్‌లోకి నీరు ఎలా వచ్చిందని ప్రశ్న
చంద్రబాబునాయుడి చేతికింది మనుషులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్ర నీటి సలహాదారులుగా నియమించారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. 2014 నుండి 2019 వరకు చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్రానికి నీటి పారుదల కార్యదర్శిగా ఉన్న వ్యక్తిని ఈరోజు తెలంగాణకు సలహాదారుగా నియమిస్తే మనకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.

ఆయన సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలం చంద్లపూర్‌లోని రంగనాయకసాగర్ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిందని చెప్పిన వారు ఈ నీరు ఎలా వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. రంగనాయకసాగర్‌లోకి కాళేశ్వరం పంప్ హౌస్‌ల ద్వారా నీటిని విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పంట ఎండిపోతుందని తాను విజ్ఞప్తి చేయగా, తన విన్నపం మేరకు ఒక టీఎంసీ నీటిని విడుదల చేశారని తెలిపారు.

గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచిపెట్టాలని చూస్తోందని విమర్శించారు. అధికారంలో ఎవరు ఉన్నా ప్రజలకు నష్టం చేయకూడదని హితవు పలికారు. కాళేశ్వరం అంతా బాగుందని, మేడిగడ్డలో ఏడు బ్లాకులు ఉంటే ఒక బ్లాక్‌లో మాత్రమే పిల్లర్ కుంగిపోయిందని చెప్పారు. కానీ గోరంతను కొండంత చేసి బురదజల్లే ప్రయత్నం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోందని, ఇప్పటికైనా పెండింగులో ఉన్న పంట కాలువలను పూర్తి చేయాలని సూచించారు.
Advertisement
Harish Rao
Telangana
BRS
Congress

More Telugu News