మేం ఇండీ కూటమిలోనే ఉన్నాం, కానీ.. సీపీఎం

  • ఢిల్లీలో ప్రారంభమైన ప్రతిపక్ష ఇండీ కూటమి సమావేశం
  • డీఎంకే సహా పలు పార్టీలు దూరం
  • సీపీఎం తరఫున జాన్ బ్రిట్టాస్ హాజరు
  • జనరల్ సెక్రటరీ హోదాలో తాను వెళ్లడం లేదన్న బేబీ
  • తమపై కాంగ్రెస్‌ చేసిన నిరాధారమైన ఆరోపణలే కారణమని వెల్లడి
నేటి ప్రతిపక్ష ‘ఇండీ’ కూటమి సమావేశానికి తాను హాజరు కావడం లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ వెల్లడించారు. అంతమాత్రాన తాము కూటమి నుంచి విడిపోవడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న కొన్ని విధానాల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

‘ఇండీ’ కూటమి ఏర్పాటులో, దాన్ని ముందుకు నడపడంలో సీపీఎం మొదటి నుంచి ఎంతో కృషి చేసిందని బేబీ తెలిపారు. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతలు తమ పార్టీపై అడ్డగోలు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కేరళలో ఎల్‌డీఎఫ్, సీపీఎం పార్టీలకు బీజేపీతో చీకటి ఒప్పందాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయడాన్ని తాము ఎంతమాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు.

ఈ నిరాధారమైన ఆరోపణలపై తాము వివరణ కోరుతూ కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గేకు ఇప్పటికే అధికారికంగా లేఖ రాశామని బేబీ చెప్పారు. ఈ లేఖ ప్రతులను కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలకు కూడా పంపామన్నారు. ఈ అంతర్గత విభేదాల కారణంగానే జనరల్ సెక్రటరీ హోదాలో తాను ఈ సమావేశానికి వెళ్లడం లేదని.. అయితే తమ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ ఈ భేటీకి హాజరవుతారని స్పష్టత ఇచ్చారు.

పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్.. ఇతర ప్రతిపక్షాలను కలుపుకొనిపోవడంలో పూర్తిగా విఫలమవుతోందని బేబీ విమర్శించారు. కూటమిలోని అందరినీ విశ్వాసంలోకి తీసుకోకుండా ఒంటెద్దు పోకడలు పోతే బీజేపీని ఎదిరించడం కష్టమని హితవు పలికారు. కాగా కేవలం సీపీఎం మాత్రమే కాకుండా డీఎంకే, జేఎంఎం వంటి మరికొన్ని కీలక ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని.. అందుకే ఈ భేటీకి డీఎంకే కూడా దూరంగా ఉంటోందని సీపీఐ నేత డి.రాజా వెల్లడించారు.
Go Back to Shorts

More Telugu News