యశ్ 'టాక్సిక్' నుంచి స్పెషల్ వీడియో.. దర్శకురాలి ప్రతిభకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్
- 'టాక్సిక్' దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ బర్త్‌డే సందర్భంగా బీటీఎస్ వీడియో రిలీజ్
- భారీ యాక్షన్ సన్నివేశాలను డైరెక్ట్ చేస్తున్న గీతూ పనితీరుపై వీడియోలో ఫోకస్
- భారీ బడ్జెట్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న మహిళా దర్శకురాలిగా ప్రశంసలు
- యశ్‌తో పాటు కీలక పాత్రల్లో నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి
ఈ బీటీఎస్ వీడియోలో దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తనదైన శైలిలో చిత్రాన్ని ఎలా తెరకెక్కిస్తున్నారో చూపించారు. భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు ఆమె కమాండింగ్ ప్రెజెన్స్, నటీనటుల నుంచి నటనను రాబట్టుకుంటున్న తీరుతో పాటు భారీ సిబ్బందిని ఎంతో నమ్మకంతో, కచ్చితత్వంతో నడిపిస్తున్న విధానం ఆకట్టుకుంటోంది. ఈ వీడియోతో పాటు, "ప్రతి షాట్ ప్రత్యేకంగా ఉండటం వెనుక, సంభాషణల కన్నా మౌనమే ఎక్కువ చెప్పడం వెనుక ఆమె ఉన్నారు! హ్యాపీ బర్త్‌డే గీతూ మోహన్‌దాస్" అంటూ చిత్ర బృందం ఒక సందేశాన్ని జోడించింది.
ఈ వీడియో కేవలం మేకింగ్ విజువల్స్ మాత్రమే కాకుండా సినిమా ఎంత భారీ స్థాయిలో నిర్మాణం జరుపుకుంటోందో కూడా తెలియజేస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇంతటి భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి చిత్రాన్ని ఒక మహిళా దర్శకురాలు డైరెక్ట్ చేయడం చాలా అరుదు. గీతూ మోహన్‌దాస్ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఈ ప్రాజెక్టును ముందుండి నడిపిస్తూ, సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనూ పాలుపంచుకుంటున్నారు.
'టాక్సిక్: ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్' పేరుతో వస్తున్న ఈ సినిమాలో యశ్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణీ వసంత్, తారా సుతారియా వంటి ప్రముఖ తారలు నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కాగా, ఇటీవలే 'సినిమాకాన్' ఈవెంట్‌లో ఈ చిత్రానికి గ్లోబల్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో సినిమాను మరింత విస్తృతంగా అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు వీలుగా రిలీజ్ డేట్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు.