మస్క్ పాదాలను ట్రంప్ ముద్దాడుతున్నట్లు ఏఐ వీడియో.. ఏకంగా అమెరికా ప్రభుత్వ బిల్డింగ్ లోనే ప్రదర్శన.. వీడియో ఇదిగో!
- హెచ్ యూడీ బిల్డింగ్ లోని స్క్రీన్లను హ్యాక్ చేసిన దుండగులు
- ట్రంప్ ను అవమానించేలా వీడియో ప్రదర్శన
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
మస్క్ పాదాలను ట్రంప్ ముద్దాడుతున్నట్లు ఏఐ సాయంతో ఓ వీడియోను రూపొందించిన దుండగులు.. హెచ్ యూడీ సర్వర్ ను హ్యాక్ చేసి టీవీలలో దీనిని ప్రసారం చేశారు. అధికారులు గమనించి ప్రసారం ఆపేలోగా పలువురు సిటిజన్లు దీనిని తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారాయి. ఇటీవల ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ సోషల్ లో ‘లాంగ్ లివ్ ది కింగ్’ అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ క్యాప్షన్ ను దుండగులు తాజా వీడియో పైన ప్రదర్శించారు.
ఈ వీడియోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇది హ్యాకర్ల పనా లేక ఉద్యోగులలోనే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ వీడియోపై హెచ్ యూడీ అధికార ప్రతినిధి కాసె లావెట్ స్పందిస్తూ.. ఇది ప్రభుత్వ వనరులను, టాక్స్ పేయర్ల డబ్బును వృథా చేసే మరో ప్రయత్నమేనన్నారు. వీడియో ప్రసారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.