Mirchi Farmers: చంద్రబాబు ఇప్పటికే మిర్చి రైతుల సమస్యలను కేంద్రానికి వివరించారు: రామ్మోహన్ నాయుడు

Ram Mohan Naidu says Chandrababu mentioned Mirchi farmers issue at Centre
షార్ట్స్‌లో చూడండి
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మిర్చి రైతుల అంశంపై నేడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిశారు. ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. శివరాజ్ సింగ్ తో సమావేశం అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. 

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు పాల్గొన్నారని తెలిపారు. ఏపీ మిర్చి రైతుల సమస్యలపై కేంద్రమంత్రితో సుదీర్ఘంగా చర్చించామని వెల్లడించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతులను ఆదుకునేందుకు యత్నిస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. 

మిర్చి ఉత్పత్తి ఖర్చును లెక్కిస్తే ఎకరాకు రూ.11,600 వచ్చిందని వెల్లడించారు. రైతులకు రూ.11,600 కంటే ఎక్కువే అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గతంలో మాదిరిగా ఇప్పుడు మిర్చి ఎగుమతులు జరగడంలేదని, మిర్చి ఎగుమతులు పెంచడంపైనా నేడు శివరాజ్ సింగ్ తో చర్చించామని తెలిపారు. మిర్చి ఎగుమతిదారులతో ఏపీలో సదస్సు నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు. సలహాలు, సూచనల మేరకు మిర్చి ఎగుమతులు పెంచడంపై దృష్టి సారిస్తున్నట్టు వివరించారు. 

మిర్చి రైతుల ఆదాయం పెంచేందుకు ఆలోచిస్తున్నామని, ఇప్పటికే మిర్చి రైతుల సమస్యలను సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి తెచ్చారని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. 

"కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు రైతుల కష్టం తెలుసు. నిన్న చంద్రబాబు వచ్చిన సమయంలో శివరాజ్ సింగ్ చౌహన్ ఢిల్లీలో లేరు. అయినప్పటికీ ఆయన చంద్రబాబుతో మాట్లాడారు. ఇవాళ ఢిల్లీ వచ్చిన వెంటనే శివరాజ్ సింగ్ అధికారులతో మాట్లాడారు. మార్కెట్ ధర, పెట్టుబడి ఖర్చుల తేడాను భరించాలని నేటి సమావేశంలో ఆయనను కోరాం. ఉత్పత్తి ఖర్చును రూ.11,600కి పైగా ఉండేలా నిర్ణయించాలని ఐకార్ (ICAR)ను కోరాం" అని రామ్మోహన్ నాయుడు వివరించారు.
Go Back to Shorts
Mirchi Farmers
Kinjarapu Ram Mohan Naidu
Atchannaidu
Shivraj Singh Chouhan
New Delhi

More Telugu News