Jagan: మీకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టే నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు నిలిపేశారు: జగన్

Jagan take a jibe at CM Chandrababu over Arogya Sri scheme
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు గారూ ఆరోగ్య శ్రీపై మీకు ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే ఒక ప్లాన్ ప్రకారం ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేసిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. మీకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టే ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు ఇవ్వాల్సిన రూ.3 కోట్లను బకాయి పెట్టారని ఆరోపించారు. 

"ఆసుపత్రులకు వెళితే ఆరోగ్య శ్రీ లేదనే మాట వినిపిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ ఎనిమిది నెలల కాలంలో ప్రజలు అప్పులు చేసి, ఆస్తులు తాకట్టు పెట్టి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? ప్రజల ఆస్తిగా వైసీపీ సృష్టించిన 17 వైద్య కళాశాలలను స్కాం చేస్తూ మీ వాళ్లకు అమ్మేస్తున్నట్టే, ఇప్పుడు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ ఆరోగ్య శ్రీ సేవలను కూడా ప్రైవేటుకు అప్పగించడం నిజం కాదంటారా? 

ప్రైవేటు బీమా కంపెనీల షరతులతో పాలసీదారులు పడే అవస్తలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి కదా చంద్రబాబు గారూ... మరి ఆరోగ్య శ్రీని కూడా వారికి అప్పగిస్తే వారి షరతులతో ప్రజలు ఇబ్బంది పడరా? లాభార్జనే వారి ముఖ్యోద్దేశం అయినప్పుడు ప్రజాప్రయోజనాలు ఎంతవరకు సాధ్యం? మీరు నాలుగు సార్లు సీఎం అయ్యానని గొప్పలు చెప్పుకుంటారు. కాని, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఏరోజైనా కనీసం ఆ ప్రయత్నం చేశారా? పోనీ దివంగత మహానేత వైయస్సార్‌ గారు దేశంలో తొలిసారిగా ఆరోగ్యశ్రీ రూపంలో ఒక గొప్ప పథకాన్ని తీసుకు వస్తే దాన్ని బలోపేతం చేసేలా మీరు ఒక్కపనైనా చేశారా? 

వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా చికిత్స అందుకునే ప్రొసీజర్ల సంఖ్యను 1,000 నుంచి 3,257కి పెంచాం. మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్టుగా సంవత్సరాదాయం రూ.5 లక్షల లోపు ఉన్నవారికి కూడా వర్తింపచేసి మధ్యతరగతివారికీ మేలు చేశాం. రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యాన్ని అందిస్తూ పేదవాడికి మంచి చేశాం. ఐదేళ్ల కాలంలో 45.1 లక్షల మందికి రూ.13,421 కోట్లు ఖర్చుచేసి ఉచితంగా వైద్యాన్ని అందించాం. 

చికిత్స తర్వాత కోలుకునేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా, చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో పేషెంటుకు తోడుగా నిలుస్తూ ఆరోగ్య ఆసరా పథకాన్ని తెచ్చి, దానికింద మరో రూ.1,465 కోట్లు అందించి రూ. 24.59 లక్షల మందికి ఆరోగ్య ఆసరాగా నిలిచాం. మరి ప్రైవేటు కంపెనీలు ఆ పని చేయగలవా? మీరు చేయించగలరా? 

తీరా మీరు అధికారంలోకి వచ్చాక సూపర్‌ సిక్స్‌ హామీలను ఎలాగూ ఎగ్గొడుతున్నారు. మేం ఇచ్చిన పథకాలనూ రద్దుచేస్తున్నారు. ఇప్పుడు కోటిన్నర కుటుంబాల ఆరోగ్యానికి ష్యూరిటీ ఎవరిస్తారు? ప్రజలకు నష్టంచేసే మీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంటనే ఆరోగ్యశ్రీని యథాతథంగా ఉంచి అమలు చేయాలి" అని జగన్ డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Jagan
Arogya Sri
Chandrababu
YSRCP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News