రెండోసారి ఇంకా బాధ్యతలే చేపట్టలేదు.. అప్పుడే మూడోసారి పోటీకి ట్రంప్ సై
- 2028లోనూ అమెరికా అధ్యక్ష రేసులో ఉంటానంటూ పరోక్షంగా వ్యాఖ్య
- మీరు వద్దంటే మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడబోనన్న ట్రంప్
- మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి
అమెరికా రాజ్యాంగం ప్రకారం రెండుసార్లు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి మూడోసారి పోటీ చేయడానికి వీలులేదు. ఈ విషయంపై అమెరికా రాజ్యాంగానికి 22వ సవరణ చేశారు. ప్రెసిడెంట్ గా ఏ వ్యక్తి అయినా రెండుసార్లకు మించి బాధ్యతలు చేపట్టకూడదని ఈ సవరణ చెబుతోంది. అయితే, ఈ సవరణ ప్రతిపాదించిన సమయంలో కానీ, అమలులోకి వచ్చిన కాలంలో కానీ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న, తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి మినహాయింపు ఉంటుందని పేర్కొంది.
ఈ సవరణ అమలులోకి వచ్చిన ఏడేళ్ల తర్వాత రాష్ట్రాల సమ్మతితో ఈ రూల్ ను తొలగించవచ్చని పేర్కొంది. నాలుగింట మూడోవంతు శాసన సభ్యులు ఆమోదం తెలిపితే మరోసారి రాజ్యంగ సవరణ చేసి ఈ రూల్ ను మార్చవచ్చని తెలిపింది. దీంతో రెండు సార్లు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన తర్వాత ట్రంప్ మూడోసారి కూడా అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే అమెరికా రాజ్యాంగానికి సవరణ చేయాల్సి ఉంటుంది. ట్రంప్ తాజా వ్యాఖ్యలు చూస్తే ఈ సవరణ దిశగా ప్రయత్నాలు చేస్తాడని అమెరికా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.