హైదరాబాదులో ఎన్ఐఏ తనిఖీల కలకలం

NIA takes up searches in Hyderabad
  • ఆగస్టులో ఉగ్రవాది రిజ్వాన్ అబ్దుల్ ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
  • ఐసిస్ పుణే మాడ్యూల్ లో పనిచేస్తున్న రిజ్వాన్
  • రిజ్వాన్ కొన్ని నెలలు హైదరాబాదులో ఉన్నట్టు నిర్ధారణ
  • నేడు రిజ్వాన్ ను వెంటబెట్టుకుని హైదరాబాదులో తనిఖీలు
ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) నేడు హైదరాబాదులో తనిఖీలు చేపట్టింది. సైదాబాద్ ప్రాంతంలోని శంఖేశ్వర్ బజార్ గ్రీన్ వ్యూ అపార్ట్ మెంట్ లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్ఐఏ తనిఖీలు దాదాపు గంటసేపు కొనసాగాయి. 

ఎన్ఐఏ ఆగస్టులో ఉగ్రవాది రిజ్వాన్ అబ్దుల్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రిజ్వాన్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అని ఎన్ఐఏ గుర్తించింది. రిజ్వాన్ అబ్దుల్ ఐసిస్ తరఫున పుణే నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు.

రిజ్వాన్ ను ఢిల్లీలోని గంగాబక్ష్ మార్గ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో అతడి నుంచి 30 బోర్ పిస్టల్, 3 కార్ట్రిడ్జ్ లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రిజ్వాన్ పై ఢిల్లీలోని స్పెషల్ సెల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రిజ్వాన్ పై ఇప్పటికే రూ.3 లక్షల రివార్డు ఉంది. 

ఢిల్లీలో అతడ్ని అరెస్ట్ చేసిన అనంతరం ఎన్ఐఏ విచారణ చేపట్టింది. రిజ్వాన్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే నేడు హైదరాబాదులో తనిఖీలు చేపట్టింది. సైదాబాద్ లోని శంఖేశ్వర్ గ్రీన్ వ్యూ అపార్ట్ మెంట్ లో రిజ్వాన్ కొన్ని నెలలు  ఉన్నట్టు ఎన్ఐఏ తాజాగా నిర్ధారించుకుంది. రిజ్వాన్ ను వెంటబెట్టుకునే ఇవాళ సోదాలు నిర్వహించడం గమనార్హం.
Advertisement
NIA
Rizwan Abdul
Hyderabad
ISIS
Pune
India

More Telugu News