బైడెన్ తప్పుకుంటేనే పార్టీకి మేలు.. అధ్యక్షుడి సన్నిహితుడి వ్యాఖ్య
- సొంతపార్టీ నుంచే బైడెన్ అభ్యర్థిత్వంపై వ్యతిరేకత
- గెలుపు కష్టమే అంటున్న బైడెన్ సన్నిహితుడు జార్జ్ క్లూనీ
- అభ్యర్థిని మార్చకుంటే రెండు సభలలో పట్టుకోల్పోతామని డెమోక్రాట్లకు వార్నింగ్
బైడెన్ గెలుపుపై పార్టీలో ఎవరికీ ఆశలు లేవని క్లూనీ చెప్పారు. చట్ట సభ్యులు, గవర్నర్లు అందరూ దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని క్లూనీ తెలిపారు. వారందరితో తాను వ్యక్తిగతంగా మాట్లాడానని, బైడెన్ తప్పుకుంటేనే బాగుంటుందని వారు అభిప్రాయపడ్డారని చెప్పుకొచ్చారు. సెనేటర్‌గా, ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షుడిగా, ఓ స్నేహితుడిగా బైడెన్‌ను తాను ఎంతో ప్రేమిస్తానని క్లూనీ చెప్పారు. గడిచిన నాలుగేళ్ల పాలనలో అనేక ఆటుపోట్లను బైడెన్ సమర్థంగా ఎదుర్కొన్నారని అన్నారు. అయితే, ఓటమి హెచ్చరికలను విస్మరిస్తూ పోతే ట్రంప్ రెండోసారి గెలుస్తారని క్లూనీ ఆందోళన వ్యక్తంచేశారు.
డిబేట్ తర్వాత ట్రంప్ కు పెరిగిన మద్ధతు..
ప్రెసిడెంట్ బైడెన్, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ల మధ్య ఇటీవల జరిగిన తొలి డిబేట్ తర్వాత ట్రంప్ కు ఆదరణ పెరిగిందని ‘సిక్కు అమెరికన్స్ ఫర్ ట్రంప్’ గ్రూప్ చీఫ్ జస్దీప్ సింగ్ జస్సీ తెలిపారు. సిక్కులతో పాటు భారతీయులు, ఆసియావాసులలో మెజారిటీ ట్రంప్ కు మద్దతు తెలుపుతున్నారని, రిపబ్లికన్ పార్టీ కోసం భారీగా విరాళాలు సేకరిస్తున్నారని జస్దీప్ చెప్పారు. ఎన్నికలు సక్రమంగా జరిగితే డొనాల్డ్ ట్రంప్ గెలవడం ఖాయమని చెప్పారు.