ఆ రెండు గంటలు ప్రత్యక్ష నరకమే.. సింగపూర్ ఫ్లైట్ బాధితులు
- పైకప్పుకు తగలడంతో తలకు గాయాలయ్యాయని వెల్లడి
- విమానం కూలిపోతోందని భయపడ్డామన్న ప్రయాణికులు
- టర్బులెన్స్ కారణంగా 100 మందికి పైగా గాయాలు
- ఇప్పటికీ 20 మంది ఇంటెన్సివ్ కేర్ లోనే ఉన్నారన్న అధికారులు
బ్రేక్ ఫాస్ట్ సిద్ధం చేస్తుండగా..
లండన్ నుంచి సింగపూర్ బయలుదేరిన సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం మయన్మార్ పైన గగనతలంలోకి ఎంటరయ్యాక తీవ్రమైన కుదుపులకు లోనైంది. ఆ సమయంలో ఫ్లైట్ సిబ్బంది బ్రేక్ ఫాస్ట్ అందించేందుకు రెడీ అవుతున్నారని ప్రయాణికులు చెప్పారు. ప్రయాణం సాఫీగా సాగుతోందని, సీట్ బెల్ట్ తీసేయవచ్చని పైలట్ అనౌన్స్ చేయడంతో తన బెల్ట్ విప్పేశానని ఓ ప్రయాణికుడు చెప్పాడు. కాసేపటికే విమానం వేగంగా కిందికి జారిపోవడం మొదలైందని తెలిపాడు. దీంతో తాను సీట్లో నుంచి ఎగిరి పైకప్పుకు తాకి కిందపడ్డానని, ఎయిర్ హోస్టెస్ సిద్ధం చేస్తున్న బ్రేక్ ఫాస్ట్ అయిటమ్స్ చెల్లాచెదురయ్యాయని వివరించాడు. మరికొంతమంది ప్రయాణికులు విసిరేసినట్లు ఓ మూలకు పడ్డారని చెప్పాడు. విమానం కూలిపోతోందని భయపడ్డామని, తన తోటి ప్రయాణికుల అరుపులు, కేకలతో భయంకర వాతావరణం నెలకొందని అన్నాడు. ఆ భయంకరమైన క్షణాలను తలుచుకుంటే ఇప్పటికీ ఆందోళన కలుగుతోందని వివరించాడు. విమానం పైకప్పుకు చాలా చోట్ల సొట్టలు (డెంట్స్) పడ్డాయని చెప్పాడు. విమానం థాయ్ లాండ్ లో ల్యాండయ్యాక ప్రాణాలు కుదుటపడ్డాయని వివరించాడు.