నన్ను కెలకొద్దు... చోటా కె నాయుడికి హరీశ్ శంకర్ సంచలన లేఖ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నన్ను కెలకొద్దు... చోటా కె నాయుడికి హరీశ్ శంకర్ సంచలన లేఖ

Harish Shankar open letter to Chota K Naidu
  • హరీశ్ శంకర్, చోటా కె నాయుడు మధ్య విభేదాలు
  • రామయ్య వస్తావయ్యా సినిమాకు సంబంధించి చోటా తన గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆరోపణ
  • ఈ విషయం ఇంతటితో వదిలేస్తే బాగుంటుందని హితవు
  • కాదు కూడదు అంటే ఎప్పుడైనా, ఎక్కడైనా నేను సిద్ధం అంటూ లేఖ
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దర్శకుడు హరీశ్ శంకర్, కెమెరామన్ చోటా కె నాయుడికి మధ్య ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. నన్ను కెలకొద్దు అంటూ హరీశ్ శంకర్ ఏకంగా చోటా కె నాయుడికి ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు హరీశ్ శంకర్ ఓ లేఖ రాశారు. 

"(వయసులో పెద్ద కాబట్టి) గౌరవనీయులైన చోటా కె నాయుడు గారికి నమస్కరిస్తూ.... రామయ్య వస్తావయ్యా సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది. ఈ పదేళ్లలో ఉదాహరణకి మీరు 10 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటే, నేను ఓ 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా. కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా మీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానకరరీతిలో మాట్లాడారు. 

మీకు గుర్తుందో లేదో... ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామన్ తో షూటింగ్ చేద్దాం అన్న ప్రస్తావన వచ్చింది. కానీ రాజుగారు చెప్పడం వల్లో, 'గబ్బర్ సింగ్' వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామన్ ను తీసేస్తున్నాడు అని పది మంది అనుకుంటారన్న కారణం వల్లో... మథనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. 

ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజూ ఆ నింద మీ మీద మోపలేదు. 'గబ్బర్ సింగ్' వచ్చినప్పుడు అది నాది, 'రామయ్య వస్తావయ్యా' విషయంలో అది నీది అనే క్యారెక్టర్ కాదు నాది. మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా, నా ప్రస్తావన రాకపోయినా, నాకు సంబంధం లేకపోయినా నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. 

ఇలా చాలాసార్లు జరిగినా నేను మౌనంగానే బాధపడ్డాను. కానీ నా స్నేహితులు, నన్ను అభిమానించేవాళ్లు నా ఆత్మాభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సి వస్తోంది. మీతో పనిచేసిన అనుభవం నన్ను బాధపెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది. 

దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు, కూడదు... మళ్లీ కెలుక్కుంటాను అంటే ఎప్పుడైనా, ఎక్కడైనా, నేను సిద్ధం!" అంటూ హరీశ్ శంకర్ తన లేఖలో పేర్కొన్నారు.
Advertisement
Harish Shankar
Chota K Naidu
Ramayya Vastavayya
Tollywood

More Telugu News