శ్రీవారి భక్తులకు బంగారు మంగళసూత్రాలు, లక్ష్మీకాసుల విక్రయం
- మత మార్పిళ్లకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా నాలుగైదు డిజైన్లలో బంగారు మంగళసూత్రాల అమ్మకం
- రూ.5,141 కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్‌కు ఆమోదం
- ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయాలు
టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.5,141.74 కోట్లు
సోమవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో రూ.5,141.74 కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్‌కు టీటీడీ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఇతర సభ్యులు మీడియాతో మాట్లాడారు. తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శ్రీపద్మావతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్‌గా పేరు మార్పునకు ఆమోదం తెలిపినట్టు వివరించారు. ఆకాశగంగ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా మార్చేందుకు నిర్ణయించామని, ఇందుకోసం రూ.30.71 కోట్లతో టెండరుకు ఆమోదం తెలిపారని చెప్పారు. ఇక టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 26 స్థానిక ఆలయాలు, విలీనం చేసుకున్న 34 ఆలయాల్లో నూతన పోస్టుల కోసం ప్రభుత్వ ఆమోదానికి ప్రతిపాదన పంపేందుకు నిర్ణయించామని చెప్పారు.