Singireddy Niranjan Reddy: లండన్‌లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి ఆగ్రహం

Niranjan Reddy fires at Revanth Reddy comments
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన లండన్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకు రావాలి కానీ అహంకారం పనికి రాదని హితవు పలికారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలకు మంచిచేసి ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకోవాలి కానీ, ఇష్టారీతిన మాట్లాడటం సరికాదన్నారు. విదేశాలలో అసంబద్ధంగా మాట్లాడి రాష్ట్రం పరువు తీశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన లండన్ పర్యటనలో... అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లో రిపీట్ అవుతాయని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను వంద మీటర్ల లోతున పాతిపెడతామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ పోరాడుతుంది

రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ పోరాడుతుందన్నారు. తెలంగాణ ఏర్పడిందే నిధులు, నీళ్లు, నియామకాల కోసమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ ఎప్పుడూ రాజీపడలేదన్నారు. నీళ్ల విషయంలో తెలంగాణకు శాశ్వత ప్రయోజనాలు కలగాలన్నారు. కృష్ణా జలాల కోసం కేసీఆర్ పోరాడలేదని చెప్పడం సరికాదన్నారు. ఈ విషయంలో కేంద్రం షరతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుందో చెప్పాలన్నారు. కేఆర్ఎంబీ పరిధిలోకి వచ్చేందుకు తెలుగు రాష్ట్రాలు ఒప్పుకున్నట్లు కేంద్రం చెబుతోందన్నారు.

ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ నిర్వహిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని... అప్పుడు తెలంగాణ తెచ్చుకున్న లక్ష్యాలు నెరవేరడం మాట పక్కన పెడితే... నష్టమే ఉంటుందని హెచ్చరించారు. కేఆర్ఎంబీ పరిధిలోకి శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులను తీసుకువెళ్లడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి తాకట్టు పెట్టిందని ఆరోపించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తే నిర్మాణం కావలసిన ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.

జలవిద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఇబ్బందులు తప్పవని, ప్రతి విషయంలో కేంద్రంపై ఆధారపడాల్సి వస్తుందన్నారు. అందుకే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కానీ ఏపీ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయలేక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డివి అసంబద్ధ వ్యాఖ్యలన్నారు. పాలమూరుకు జాతీయహోదాపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
Go Back to Shorts
Singireddy Niranjan Reddy
BRS
Congress
Revanth Reddy

More Telugu News