స్కూలు బెంచీలే వంటచెరుకు.. విరగ్గొట్టి మధ్యాహ్న భోజనం వండిన కుక్స్
- బీహార్ రాజధాని పాట్నాలోని అప్‌గ్రేడెడ్ మిడిల్ స్కూల్‌లో ఘటన
- వైరల్ అయిన వీడియోలు
- విచారణకు ఆదేశించిన విద్యాశాఖ అధికారులు
- ‘హ్యూమన్ ఎర్రర్’గా కొట్టిపడేసిన ప్రిన్సిపల్
భోజనం వండేందుకు కలప అందుబాటులో లేకపోవడంతో టీచర్ సవితా కుమారి చెప్పడంతో బెంచీలతో వంట చేసినట్టు వంటమనుషులు చెప్పారు. అంతేకాదు, తాము వాటితో వంట చేస్తుంటే తిరిగి టీచరే వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారని ఆరోపించారు. ఈ ఆరోపణలను సవితా కుమారి ఖండించారు. తనను అప్రతిష్ఠ పాలు చేసేందుకు కుక్స్ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంచీలను కాల్చుకోమని ప్రిన్సిపలే ఆమెకు చెప్పినట్టు సవిత ఆరోపించారు.
ఈ ఆరోపణలను ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ రంజన్ ఖండించారు. కుక్స్ చదువుకోలేదని, వాతావరణం చల్లగా ఉండడంతో బెంచీలను కాల్చారని చెప్పుకొచ్చారు. ఈ ఘటనను ‘హ్యూమన్ ఎర్రర్’గా పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనాన్ని తాము గ్యాస్‌తోనే వండుతామని వివరించారు.