గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏముంది?: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పడం ఏమిటి? అన్న శ్రీహరి
- 2014లోనే తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయిందని వ్యాఖ్య
- గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని విమర్శ
తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని, ఐటీ ఉత్పత్తులు, ఎగుమతుల్లో హైదరాబాద్ బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించిందన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడే సంతోషపడుతున్నట్లుగా మాట్లాడడం సరికాదన్నారు. పదేళ్లుగా తెలంగాణ ప్రజలు స్వేచ్ఛవాయువులు పీలుస్తుంటే... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే సంతోషంగా ఉన్నారని చెప్పడం ఏమిటి? అని నిలదీశారు. తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయిందని గవర్నర్ చెప్పడాన్ని కడియం తప్పుబట్టారు. మెడలు వంచి తెలంగాణ సాధించామని, కానీ గవర్నర్ అబద్ధాలు చెప్పడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. 2014లోనే తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయిందని, ఇప్పుడు కావడం ఏమిటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు గవర్నర్ తన ప్రసంగంలో ఎలాంటి ప్రణాళికనూ ప్రకటించలేదని విమర్శించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన ఓ రూట్ మ్యాప్ ఉండాల్సిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం... గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించిందని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో దళిత బంధు ప్రస్తావన లేదని, రూ.500 మద్దతు ధర అంశం లేదన్నారు. చూస్తుంటే కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కనిపించడం లేదన్నారు. ప్రభుత్వం విడుదల చేసే శ్వేతపత్రాలపై తమ నుంచి సరైన సమాధానం ఉంటుందని స్పష్టం చేశారు.