Gemini AI: జెమినీ శకం మొదలైంది: సుందర్ పిచాయ్

Google develops new AI model Gemini
షార్ట్స్‌లో చూడండి
ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏఐ (కృత్రిమ మేధ) గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో ఓపెన్ ఏఐ సంస్థ తీసుకువచ్చిన ఏఐ ఆధారిత టూల్ చాట్ జీపీటీ వస్తూనే సంచలనం సృష్టించింది. దాంతో ప్రత్యర్థి టెక్ సంస్థలు కూడా ఏఐ బరిలో దిగాయి. 

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా చాట్ జీపీటీకి పోటీగా బార్డ్ ను తెరపైకి తెచ్చింది. ఇప్పుడు తన బార్డ్ ను మరింత ఆధునికీకరించే చర్యల్లో భాగంగా గూగుల్ సరికొత్త ఏఐ నమూనా జెమినీని అభివృద్ధి చేసింది. దీనిపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పందించారు. ఇది జెమినీ శకానికి ఆరంభం అని అభివర్ణించారు. 

"సెర్చ్ రిజల్ట్స్ లో ఏఐ సాంకేతికతను చొప్పించి ప్రజలకు అందించడానికి డీప్ మైండ్ ఏఐ ల్యాబ్ ను స్థాపించాం. ఆనాటి మా ఆలోచనలకు వాస్తవరూపమే ఈ జెమినీ ఏఐ నమూనా. దీనికి సంబంధించిన పరిశోధనలను మేం ఎంతో ధైర్యంగా, బాధ్యతతో చేపడుతున్నాం. ఓ లక్ష్యం దిశగా ఆవిష్కరణలు చేయడం, ప్రజలకు, సమాజానికి అపారమైన ప్రయోజనాలు చేకూర్చే సామర్థ్యాలను అందిపుచ్చుకోవడం మా ప్రాధాన్యత అంశాలు. అదే సమయంలో ఏఐ సామర్థ్యంతో ఎన్నో సవాళ్లు తలెత్తుతున్నాయి. ఏఐతో లాభాలే కాదు, నష్టాలు కూడా ఉండడంతో, సైబర్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలతోనూ, నిపుణులతోనూ మేం కలిసి పనిచేస్తున్నాం"  అంటూ సుందర్ పిచాయ్ తన బ్లాగ్ లో పేర్కొన్నారు.

జెమినీ ఏఐ అంటే ఏమిటంటే...

ఇది ఒక సాఫ్ట్ వేర్ టూల్ వంటిది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి రూపొందించిన ఒక భారీ లాంగ్వేజ్ నమూనానే ఈ జెమినీ. అంతేకాదు దీంట్లో ఒక సంక్లిష్ట గణిత వ్యవస్థ కూడా ఉంటుంది. ఈ వ్యవస్థ ద్వారా జెమినీ ఏఐ అపారమైన డేటాను విశ్లేషించి తనంతట తానే అనేక కొత్త నైపుణ్యాలను అలవర్చుకుంటుంది. 

పుస్తకాలు, వికీపీడియా వ్యాసాలు, ఆన్ లైన్ బులెటిన్ బోర్డులు... ఇలా దేన్నీ వదలకుండా చదివేసి, ప్రతి అంశంలోనూ తన సొంత డేటాను రూపొందిస్తుంది. తద్వారా పరీక్షలు రాయడమే కాదు, సొంతంగా కంప్యూటర్ కోడ్ లను కూడా సృష్టిస్తుంది. అంతేకాదు, తన డేటాలో నిక్షిప్తమైన ఆలోచనలను విశ్లేషించి ఓ మనిషిలా సంభాషించగలదు. ఓపెన్ ఏఐ తీసుకువచ్చిన చాట్ జీపీటీకి జెమినీతో బదులివ్వాలని గూగుల్ భావిస్తోంది.
Go Back to Shorts
Gemini AI
Google
Bard
Sundar Pichai
ChatGPT
OpenAI
Microsoft

More Telugu News