కొత్త కుట్రలకు కాంగ్రెస్, బీజేపీ ప్లాన్: కేటీఆర్
- తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు
- మరింత ముదిరిన విమర్శల దాడులు
- కేసీఆర్ చక్రం తిప్పకుండా కుట్రలు జరుగుతున్నాయన్న కేటీఆర్
- వచ్చే 15 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు
జాతీయస్థాయిలో కేసీఆర్ చక్రం తిప్పకుండా కొత్త కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. ఒకాయన కాళేశ్వరం మునిగిపోయిందని అంటాడని, మరొకాయన బ్యారేజి కొట్టుకుపోయిందని అంటాడని... ఢిల్లీలోని బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాల్లో ఇలాంటివే కొత్త కొత్త వంటకాలు చేసి ప్రజల మీదకు వదులుతారని కేటీఆర్ అన్నారు. 15 రోజులు ఇవే కుట్రలు చేస్తూ మన ఆలోచన మారేలా చేస్తారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇక, మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపైనా కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. డబ్బు ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జనాలను కొనాలని చూస్తున్నాడని వ్యాఖ్యానించారు. రాజగోపాల్ రెడ్డి ధన మదాన్ని ఈ ఎన్నికల్లో అణచివేయాలని పిలుపునిచ్చారు.
అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు రాళ్ల దాడిలో గాయాలు కావడంపైనా కేటీఆర్ స్పందించారు. ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ములేక భౌతిక దాడులకు దిగుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచిది కాదని హితవు పలికారు.