నలభై ఏళ్లలోపు వారికి గుండెపోటు.. కారణాలు ఇవేనట..!
- యువతలో పెరుగుతున్న గుండెపోటు బాధితుల సంఖ్య
- జీవనశైలిలో మార్పులే ప్రధాన కారణమంటున్న నిపుణులు
- మద్యపానం, ధూమపానంతో హృద్రోగ సమస్యలు తప్పవని హెచ్చరిక
40 ఏళ్లలోపు వయస్కులలో గుండెపోటుకు కారణాలు..
- వైట్ కాలర్ ఉద్యోగాల వల్ల రోజులో ఎక్కువ భాగం కూర్చుని పనిచేయడంతోనే సరిపోతోంది. నడక తగ్గి, శారీరక శ్రమ దాదాపు పూర్తిగా లేకుండా పోతోంది. మారిన జీవనశైలితో వచ్చిన ప్రధాన మార్పులివి. వీటివల్ల యువతలో హృద్రోగ సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
- ఆహారపుటలవాట్ల వల్ల మధుమేహ బాధితుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగింది. ఇది కూడా గుండె జబ్బులకు ఓ కారణమని వైద్యులు అంటున్నారు. మిగతా వారితో పోలిస్తే మధుమేహ బాధితులు గుండె జబ్బులతో చనిపోయే ముప్పు 2 నుంచి 4 రెట్లు ఎక్కువని చెప్పారు.
- హృద్రోగ వ్యాధులకు కారణమయ్యే వాటిలో అధిక రక్తపోటు లేదా హైబీపీ ముఖ్య కారణం. అధిక రక్తపోటు వల్ల కండరాలు మందంగా మారి రక్తనాళాలను దెబ్బతీస్తాయి. ఫలితంగా రక్తప్రసరణలో మార్పులు చోటుచేసుకుని గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది.
- అధిక బరువు అనారోగ్యకరమని, హృద్రోగంతో పాటు పలు ఇతర అనారోగ్యాలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
- ధూమపానం అలవాటు గుండెపోటుకు దారితీస్తుందని, రోజూ కాల్చే సిగరెట్లు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు లేవి వారితో పోలిస్తే పొగరాయుళ్లకు గుండెపోటు ముప్పు 34 శాతం ఎక్కువని చెప్పారు. మద్యపానం కూడా గుండెపోటుకు కారణమవుతోందని వివరించారు.