Advertisement

అప్‌డేట్స్ తెలుసుకోని ఔట్ డేటెడ్ పొలిటీషియన్ రాహుల్ గాంధీ: హరీశ్ రావు

Rahul Gandhi is outdated politician says Harish Rao
  • దేశాన్ని దోచుకున్న చరిత్ర కాంగ్రెస్ ది అన్న హరీశ్
  • బీఆర్ఎస్ ఎవరికీ బీ టీమ్ కాదని వ్యాఖ్య
  • ఖమ్మం సభలో రాసిచ్చిన స్క్రిప్ట్ తో రాహుల్ స్కిట్ చేశారని విమర్శ
ఖమ్మంలో సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా హరీశ్ స్పందిస్తూ దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి మారుపేరుగా మారిందని విమర్శించారు. అందువల్లే మీ పార్టీ పేరు స్కాంగ్రెస్ గా మారిందని అన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ ను అధికారం నుంచి దింపేసి మూలన కూర్చోబెట్టారని చెప్పారు. 

"బీఆర్‌ఎస్‌ ఎవరికీ బీ టీం కాదు.. మాది పేద ప్రజలకు ఏ టీం. ప్రజల సంక్షేమం చూసే ఏ క్లాస్ టీం. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదు. అందుకే దేశాన్ని బీజేపీ కబంద హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్‌ఎస్‌ పుట్టింది. రాష్ట్రంలో పోడు పట్టాల పంపిణీ కళ్లకు కనిపించలేదా..? మేం పట్టాలు పంచినంక మళ్లీ మీరిచ్చేదేంది? అప్‌డేట్ తెలుసుకోని ఔట్ డేటెడ్ పొలిటీషియ‌న్ రాహుల్‌ గాంధీ. 

కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు మొత్తం 80,321.57 కోట్లు అయితే, అవినీతి లక్ష కోట్లు అని అనడం పెద్ద జోక్. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని, కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడ ఇవ్వ‌లేద‌ని మీ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం స‌మాధానం ఇచ్చిన విష‌యం తెలియ‌దా?  స్కాముల్లో ఆరితేరిన కాంగ్రెస్ కుంభకోణాల గురించి మాట్లాడడం.. దెయ్యాలు వేదాలు వల్లించ‌డ‌మే. 

అప్పుడే ముదిగొండ కాల్పులను మరిచిపోయారా? భూములు అడిగితే జైల్లో వేసిన వాళ్ళు, కరెంట్ అడిగితే పిట్టల్లా కాల్చి చంపినోళ్లు ఖమ్మంలో కల్లిబొల్లి కబుర్లు చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఖ‌మ్మం స‌భ గురించి ఒక్క ముక్క‌లో చెప్పాలంటే.. పసలేని ఆరోపణలు, ఊకదంపుడు ప్రసంగాలు.. రాసిచ్చిన స్క్రిప్ట్ తో రాహుల్ స్కిట్.." అని హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.
Advertisement
Harish Rao
BRS
Rahul Gandhi
Congress

More Telugu News