నేడు ఢిల్లీకి కేటీఆర్.. అమిత్ షాతో భేటీ!
- నేడు, రేపు ఢిల్లీలోనే ఉండనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
- రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరేందుకు వెళ్తున్నట్టు ప్రచారం
- అమిత్ షాతో రాజకీయ అంశాలూ చర్చకు వచ్చే అవకాశం
రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరేందుకే ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్లు చెబుతున్నా కేటీఆర్, అమిత్ షా భేటీలో ఇతర రాజకీయ వ్యవహారాలూ చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు తెలిసింది. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్థి కార్యక్రమాలకు కేంద్రప్రభుత్వం నుంచి సహకారం లభించడం లేదని, పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర అంశాల విషయంలో మరోసారి మరింత ఒత్తిడి తీసుకువచ్చేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారని బీఆర్ ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రసూల్‌పుర వద్ద చేపట్టిన రోడ్డు అభివృద్థి కార్యక్రమాలకు హోంశాఖ పరిధిలో ఉన్న భూముల గురించి కేటీఆర్ అమిత్ షాతో మాట్లాడుతారని చెప్పాయి. నగరంలో తలపెట్టిన స్కై వేల నిర్మాణం కోసం రక్షణశాఖ నుంచి అడుగుతున్న కంటోన్మెంట్ భూముల వ్యవహారం గురించి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కానున్నారు. వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ కు సంబంధించిన అంశం, మెట్రో విస్తరణకు సంబంధించి ఆయా శాఖల కేంద్ర మంత్రులతో కేటీఆర్ సమావేశం అవనున్నారు.