నగ్నత్వం, అశ్లీలత ఒకటి కాదు.. కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్య

Kerala high court grants relief to social activist fatima
  • కొడుకు, కూతురితో తన నగ్నదేహంపై పెయింటింగ్ వేయించుకున్న సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమా
  • నెట్టింట వీడియో వైరల్, ఫాతిమాపై పోక్సో సహా పలు చట్టాల కింద కేసు నమోదు
  • కేసుల నుంచి విముక్తి కల్పించాలంటూ కేరళ హైకోర్టును ఆశ్రయించిన ఫాతిమా
  • మహిళలు తమ శరీరం గురించి ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవచ్చన్న కోర్టు
కేరళ సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాకు కేరళ హైకోర్టు తాజాగా ఊరటనిచ్చింది. కుమారుడు, కుమార్తెతో తన నగ్నదేహంపై పెయింటింగ్ వేయించుకున్న కేసు నుంచి ఆమెకు విముక్తి కల్పించింది. ఫాతిమా తన దేహాన్ని పిల్లలకు కాన్వాస్‌గా ఉపయోగించిందే తప్ప లైంగిక ఉద్రేకాలను తృప్తి పరుచుకోడానికి తన పిల్లలను ఉపయోగించుకున్నట్టు భావించకూడదని తేల్చి చెప్పింది. 

కొన్నేళ్ల క్రితం ఫాతిమా నెట్టింట షేర్ చేసిన ఓ వీడియో వివాదాస్పదమైంది. అందులో ఫాతిమా తన శరీరం పైభాగంపై ఎటువంటి ఆచ్ఛాదనా లేకుండా మంచంపై పడుకుని ఉండగా ఆమె కుమార్తె, కుమారుడు ఒంటిపై పెయింటింగ్ వేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఫాతిమాపై పోక్సో చట్టం, జువెనైల్ జస్టిస్ యాక్ట్, ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. వీటి నుంచి విముక్తి కల్పించాలంటూ ఫాతిమా తొలుత ట్రయల్ కోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. దీంతో ఆమె హైకోర్టులో అప్పీలు చేసుకుంది. 

ఈ క్రమంలో హైకోర్టు న్యాయమూర్తి ఫాతిమాకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. కేసుల నుంచి ఆమెకు విముక్తి కల్పించిన న్యాయమూర్తి నగ్నత్వం, అశ్లీలత ఒకటి కాదని వ్యాఖ్యానించారు. మహిళలకు తమ శరీరాలపైనే హక్కులేకుండా పోతోందని, ఈ విషయంలో వారికి ఎలాంటి నిర్ణయమైనా స్వతంత్రంగా తీసుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. ఇది వారికి రాజ్యాంగంలోని 21వ అధికరణ ద్వారా సంక్రమించిన హక్కు అని తెలిపారు.
Go Back to Shorts
Kerala

More Telugu News