చప్పట్లు కొట్టమన్నా మనకి చేతకాదు.. అంత గొప్ప హృదయం మనది: మంత్రి ధర్మాన ఆగ్రహం

Minister Dharmana Prasada Rao inaugurates TIDCO houses
  • శ్రీకాకుళంలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన మంత్రి ధర్మాన
  • పదవులు కోరుకుంటున్న వారే జగన్‌ను సైకో, పిచ్చోడు అంటున్నారన్న మంత్రి
  • టీవీల్లో, పేపర్లలో వచ్చింది చూసి నిజమని అనుకోవద్దని సూచన
  • ఇష్టముంటే ఓటేయాలని, లేదంటే  లేదన్న ధర్మాన
శ్రీకాకుళంలోని పాత్రునివలసలో నిర్మించిన టిడ్కో ఇళ్ల పంపిణీలో మంత్రి ధర్మాన ప్రసాదరావు అసహానానికి గురయ్యారు. వచ్చిన జనం చప్పట్లు కొట్టకపోవడంతో ‘గొప్ప హృదయం ఉన్న వాళ్లం మనం’ అని ఎద్దేవా చేశారు. మరో మంత్రి ఆదిమూలపు సురేశ్‌తో కలిసి నిన్న ఇళ్లను పంపిణీ చేసిన ధర్మాన మాట్లాడుతూ.. పేదల కోసం చేసే ఏ పనిని అయినా ముఖ్యమంత్రి జగన్ ఆషామాషీగా తీసుకోరని అన్నారు. 

అన్నీ పక్కాగా ఉండాలని అధికారులకు జగన్ సూచనలు ఇస్తారని అన్నారు. ఆయన పిచ్చోడు, క్రాక్ అయితే ఇలాంటి పనులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఇష్టముంటే ఓటేయాలని, లేదంటే లేదని, కానీ అలా మాట్లాడడం తప్పని అన్నారు. మీరంతా సంతోషంగా ఉన్నారంటే దానికి జగనే కారణమని, చప్పట్లు కొట్టమన్నా మనకి చేతకాదని, అంతటి గొప్ప హృదయం మనకు ఉందని అన్నారు.

తెలిసీ తెలియని విషయాలను టీవీల్లో, పేపర్లలో చూసి అదే నిజమనుకుంటామని, రాష్ట్రాన్ని తగలబెట్టేస్తున్నారని అంటారని, మీ పిల్లల్ని చదివించడం, ఇల్లు కట్టించి ఇవ్వడం తగలబెట్టేడయమా? అని ప్రశ్నించారు. ప్రతి నెలా మీకు వస్తున్న డబ్బులు ఎక్కడివని నిలదీశారు. ఎవరో అంటే అనేయడం కాదని, అర్థం చేసుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని జగన్‌కు చెబుతున్నానని అన్నారు. పదవులు కావాల్సిన వారే జగన్‌ను సైకో, పిచ్చోడు అని అంటున్నారని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Srikakulam District
Dharmana Prasada Rao
YSRCP

More Telugu News