'లైకా' చేతికి అరుణ్ విజయ్ భారీ చిత్రం ‘మిషన్ - చాప్టర్ 1’
- లైకా నుంచి మరో భారీ యాక్షన్ చిత్రం
- అరుణ్ విజయ్ జోడీ కట్టిన అమీ జాక్సన్
- 70 రోజులలో షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా
- 4 భాషలలో విడుదల కానున్న సినిమా
భారీ చిత్రాలుగా అందరి ఆదరాభిమానాలను పొందిన '2.0' .. 'పొన్నియిన్ సెల్వన్' .. 'ఇండియన్ 2' వంటి చిత్రాలు సహా ఎన్నో భారీ చిత్రాలను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ‘మిషన్ .. చాప్టర్ 1’ చిత్రాన్ని నాలుగు భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయటానికి సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, ఆడియో, థియేట్రికల్ రిలీజ్‌కి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
విలక్షణమైన సినిమాలను తెరకెక్కించే ప్రతిభ ఉన్న దర్శకుడు విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘మిషన్ - చాప్టర్ 1’ చిత్రాన్ని కేవలం 70 రోజుల్లో లండన్, చెన్నై సహా పలు లొకేషన్స్‌లో శరవేగంగా చిత్రీకరించటం గొప్ప విషయం. అద్భుతమైన టెక్నికల్ అంశాలతో రూపొందిన ‘మిషన్ - చాప్టర్ 1’ చిత్రం హీరో అరుణ్ విజయ్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళుతుందనటంలో సందేహం లేదు. చాలా గ్యాప్ తర్వాత ఎమీ జాక్సన్ ఈ సినిమాలో చేస్తున్నారు. జైలును సంరక్షించే ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనున్నారు.
మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన విలక్షణ నటి 'నిమిషా సజయన్' ఈ మూవీలో ఓ కీలక పాత్రను పోషించారు. జి.వి.ప్రకాష్ ఈ చిత్రానికి సంగీత సారథ్యాన్ని వహిస్తున్నారు. ఈ సినిమా కోసం లండన్ జైలును పోలి ఉండేలా చెన్నైలో భారీగా ఖర్చుతో ఓ జైలు సెట్ వేశారు. స్టంట్ సిల్వ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు ఆహా అనిపిస్తాయి. ఈ సినిమాలో చిత్రీకరించిన నైట్ షాట్స్, డ్రామా ప్రేక్షకులను ఉత్కంఠతకు లోను చేస్తుంది. యాక్షన్ సన్నివేశాల్లో ఎంత కష్టమున్నప్పటికీ హీరో అరుణ్ విజయ్ స్వయంగా ఆ సన్నివేశాల్లో నటించారు. దీంతో యాక్షన్ సన్నివేశాలు రియలిస్టిక్‌గా వచ్చాయి. ఈ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.