ఏ తప్పు చేయకపోయినా 'అమరరాజా'ను ఇబ్బందులకు గురిచేశారు: చంద్రబాబు
Advertisement

ఏ తప్పు చేయకపోయినా 'అమరరాజా'ను ఇబ్బందులకు గురిచేశారు: చంద్రబాబు

Chandrabau speech in Nidadavolu
  • తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • కొవ్వూరు నుంచి నిడదవోలు వరకు రోడ్ షో
  • ఇంత నీచమైన సీఎంను చూడలేదన్న చంద్రబాబు
  • సీఎం పదవి తనకు కొత్త కాదని వెల్లడి
  • సైకో చేతిలో రాష్ట్రం నాశనమవుతోందని వ్యాఖ్య  
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. కొవ్వూరు నుంచి నిడదవోలు వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఇంత నీచమైన సీఎంను తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఏపీకి పట్టిన ఐదేళ్ల శనిని వదిలించుకునేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.  

రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోందని, ఒక సైకో ఊరికొక సైకోను తయారుచేశాడని విమర్శించారు. సైకో పాలనలో రాష్ట్రం అధోగతిపాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయని, అమరరాజా కంపెనీ కూడా తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు చేస్తోందని అన్నారు.  

అమరరాజా గ్రూప్ తెలంగాణలో రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెడుతోందని తెలిపారు. అమరరాజా సంస్థను వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని చంద్రబాబు ఆరోపించారు. అమరరాజాను గత ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే, ఈ సీఎం వేధించారని మండిపడ్డారు. ఇవాళ ఏపీ వ్యక్తి మరో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. 

నారాయణ విద్యాసంస్థల అధినేతకు కూడా వేధింపులు ఎదురవుతున్నాయని తెలిపారు. కేసులపై కేసులు పెడుతూ నారాయణను వేధిస్తున్నారని వివరించారు. రాజకీయ దురుద్దేశాలతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని సైకో బారి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పిలుపునిచ్చారు. సీఎం పదవి తనకేమీ కొత్త కాదని, రాష్ట్ర భవిష్యత్తు నాశనమవుతుండడం బాధ కలిగిస్తోందని చెప్పారు.
Advertisement
Chandrababu
Nidadavolu
TDP
East Godavari District

More Telugu News