యువతి విషయంలో గొడవ.. భీమవరంలో ఇంజినీరింగ్ విద్యార్థిని గదిలో బంధించి అమానుషంగా ప్రవర్తించిన తోటి విద్యార్థులు

Bhimavaram Engineering student Beaten by co students
  • వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి
  • బాధిత విద్యార్థిని హాస్టల్ గదికి పిలిపించి దాడి
  • కర్రలతో కొడుతూ ఇస్త్రీపెట్టెతో కాల్చిన సహ విద్యార్థులు
  • నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
  • బాధిత యువకుడు, యువతి సహా ఆరుగురిని సస్పెండ్ చేసిన కాలేజీ
యువతి విషయంలో గొడవ పడిన ఇంజినీరింగ్ విద్యార్థులు.. తమ సహచరుడైన ఓ యువకుడిని గదిలో బంధించి కర్రలతో చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలకెక్కి వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. భీమవరంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో అంకిత్ ఇంజినీరింగ్ రెండో ఏడాది చదువుతున్నాడు. ఓ యువతి విషయంలో నలుగురు విద్యార్థులు అంకిత్‌తో గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఈ నెల 2న అంకిత్‌ను హాస్టల్‌లోని తమ గదికి పిలిచిన నలుగురు విద్యార్థులు అతడిని గదిలో బంధించి కర్రలతో చావబాదారు. ఆపై ఇస్త్రీపెట్టతో కాల్చారు. తనను విడిచిపెట్టాలని బాధిత విద్యార్థి వేడుకుంటున్నా వారు కనికరించలేదు. 

యువకుడిని చితకబాదుతుండగా కొందరు విద్యార్థులు తీసిన వీడియో నిన్న వెలుగులోకి రావడంతో పోలీసులు స్పందించారు. దాడికి పాల్పడిన ప్రవీణ్, ప్రేమ్, నీరజ్, స్వరూప్‌లపై కేసు నమోదు చేశారు. విద్యార్థులందరూ శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందినవారని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన కాలేజీ యాజమాన్యం బాధిత యువకుడు, యువతి సహా ఆరుగురిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది.
Go Back to Shorts
Bhimavaram
Andhra Pradesh
Engineering Students

More Telugu News