బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో, హెరిటేజ్ జ్యూసో అనుకున్నారా?: చంద్రబాబుపై బొత్స సెటైర్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో, హెరిటేజ్ జ్యూసో అనుకున్నారా?: చంద్రబాబుపై బొత్స సెటైర్లు

Botsa fires on Chandrababu
  • నా నియోజకవర్గానికి వెళ్లి నేను పనికిమాలిన వాడిని అన్నట్టుగా మాట్లాడారన్న బొత్స 
  • రాష్ట్రానికి పనికొచ్చే ఒక్క మంచి మాట కూడా మాట్లాడలేదని విమర్శ 
  • చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడారన్న మంత్రి 
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. తన నియోజకవర్గానికి వెళ్లి తాను ఒక పనికిమాలిన వ్యక్తి అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడారని మండిపడ్డారు. పనికిమాలిన తనానికి పేటెంట్ హక్కు చంద్రబాబుదేనని చెప్పారు. రాష్ట్రానికి పనికొచ్చే ఒక్క మంచి మాట కూడా చంద్రబాబు మాట్లాడలేదని విమర్శించారు. 

బైజూస్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని బొత్స చెప్పారు. బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో, హెరిటేజ్ జ్యూసో అనుకుంటున్నారా? అని ఎద్దేవా చేశారు. బైజూస్ అంటే ఏమిటో మీ మనవడిని అడిగితే చెపుతాడని అన్నారు. 

మమ్మీ, డాడీ అని పిలవడం కోసం ఇంగ్లీష్ మీడియం అని చంద్రబాబు అంటున్నారని... అందుకేనా మీ కొడుకుని ఇంగ్లీష్ మీడియంలో చదివించారు? అందుకేనా విదేశాలకు పంపించింది? అని బొత్స ప్రశ్నించారు. పేద పిల్లలకు కూడా అంతర్జాతీయ కంటెంట్ అందుబాటులో ఉండాలనే బైజూస్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడారని అన్నారు.
Chandrababu
Telugudesam
Botsa Satyanarayana
YSRCP

More Telugu News