చంద్రబాబు, బీజేపీపై విరుచుకుపడిన బొత్స.. తీవ్ర విమర్శలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు, బీజేపీపై విరుచుకుపడిన బొత్స.. తీవ్ర విమర్శలు

AP Minister Botsa Fires on Chandrababu and BJP
  • ముందస్తు ఎన్నికలు కావాల్సింది చంద్రబాబుకేనన్న బొత్స
  • ప్రజలు ఎలాంటి కష్టాలు లేకుండా సుఖంగా ఉన్నారని వ్యాఖ్య
  • ప్రతి ఒక్కరికీ రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చడం ఫ్యాషనైపోయిందంటూ పవన్‌కు కౌంటర్
  • దేశం ప్రశాంతంగా ఉంటే మతాలు, వర్గాలు అంటూ బీజేపీ రెచ్చగొడుతుందని ఫైర్
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన.. ప్రజలు కష్టాల్లో ఉన్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించారు.

 ప్రజలకు ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకుంటున్నామని, వారికి ఏమైనా కష్టాలు ఉన్నాయీ అంటే అవి కేంద్ర ప్రభుత్వ విధానాలు, పెట్రోలు, డీజిల్ ధరలవల్లేనని చెప్పారు. వీటివల్ల దేశమంతా ఇబ్బంది పడుతోందని అన్నారు. అలాగే, చంద్రబాబు చేస్తున్న ముందస్తు ఎన్నికల వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. 

ప్రజలు ఐదేళ్లూ పాలించమని తమను గెలిపించారని, కాబట్టి ముందస్తు ఎన్నికలు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలు కావాల్సింది చంద్రబాబుకేనని విమర్శించారు. ఈ విషయంలో తమ పార్టీ, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి కానీ, అలా చెప్పడానికి చంద్రబాబు ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీని శ్రీలంకతో పోల్చడం ప్రతి ఒక్కరికీ ఫ్యాషనైపోయిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. అక్కడ బలమైన నాయకత్వం లేకపోవడం వల్లే అలా అయిందని, కానీ ఇక్కడ బలమైన నాయకత్వం ఉందని, పార్టీకి ఓ విధానమంటూ ఉందని బొత్స పేర్కొన్నారు.

పనిలో పనిగా బీజేపీపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ఎంతసేపు మతాలు, వర్గాలు అనడం తప్ప మరోటి లేదని అన్నారు. పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నప్పుడు మందిరమో, మరో దానినో తీసుకొస్తారని ఆరోపించారు. పేదలు, ఎస్సీలు, ఎస్టీల కోసం కేంద్రం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. 

ఎస్సీ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, ప్రభుత్వం తీరుతో పేదలు మరింత పేదలుగా మారుతున్నారంటూ బీజేపీ చేపట్టిన ఆందోళనపై బొత్స మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీకి ఉన్న స్థాయేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి ఎప్పుడు వచ్చిందో తెలుసుకోవాలని సూచించారు. బీజేపీ వాళ్లు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని మంత్రి హితవు పలికారు.
Botsa Satyanarayana
YSRCP
TDP
Chandrababu
BJP

More Telugu News